
గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో విటమిన్లు, అధిక ప్రోటీన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, అమైనో ఆమ్లాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆరోగ్య నిపుణులు రోజుకు ఒక గుడ్డు తినడం మంచిదని సలహా ఇస్తున్నారు. అలాగే గుడ్లను వివిధ వంటకాల తయారీలోనూ ఉపయోగిస్తారు. అందువల్ల చాలా మంది ఒకేసారి పెద్ద మొత్తంలో గుడ్లను మార్కెట్లో కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తారు. అయితే వీటిని సరిగ్గా నిల్వ చేయకపోతే, అవి త్వరగా చెడిపోయే అవకాశం ఉంది. అలాంటి గుడ్లు ఆరోగ్యానికి కూడా హానికరం. అటువంటి పరిస్థితిలో మీరు మార్కెట్లో కొనేటప్పుడు గుడ్డు చెడిపోయిందో లేదో ఎలా కనుగొనాలో ఇక్కడ తెలుసుకుందాం..
గుడ్లు తరచుగా సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల చెడిపోతాయి. ఈ బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఈ బ్యాక్టీరియా ఎంత వేగంగా పెరుగుతుందో, గుడ్డు అంత వేగంగా చెడిపోతుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా రోజురోజుకూ గుడ్డు నాణ్యత తగ్గుతుంది.
గుడ్డు కుళ్ళిపోయిందో లేదో తెలుసుకోవడానికి వీటిని నీటిలో ఉంచడం ద్వారా పరీక్షించవచ్చు. ఫ్లోట్ టెస్ట్ చేయడానికి ఒక గిన్నె నీటిని తీసుకుని అందులో సున్నితంగా గుడ్డును వదలాలి. నీటిలోని గుడ్డు మునిగిపోతే అది తాజాగా ఉన్నట్లు. అదే గుడ్డు సగం నీటిలో ఉంటే అవి చాలా కాలం నాటివని అర్ధం. ఇక గుడ్డు పూర్తిగా నీటిలో తేలితే అది కుళ్ళిపోయిందని అర్ధం చేసుకోవాలి.
ఈ పద్ధతి గుడ్డు లోపలి భాగాన్ని చూడటానికి మీకు సహాయపడుతుంది. దీని కోసం మీరు మీ మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్‌ను ఆన్ చేసి దానిపై గుడ్డు ఉంచాలి. గుడ్డు షెల్‌లోని స్పష్టమైన పసుపు రంగును చూపిస్తే అది తాజాగా ఉందని అర్థం. అదే గుడ్డు తెల్లగా కనిపిస్తే, అది కుళ్ళిపోయిందని అర్థం.
గుడ్డు కుళ్ళిపోయిందో లేదో తెలుసుకోవడానికి మరొక పద్ధతి ద్వారా కూడా తెలుసుకోవచ్చు. కుళ్ళిన గుడ్లు పచ్చిగా ఉన్నా లేదా ఉడికించినా దుర్వాసన వెదజల్లుతాయి. వాటిని ముక్కు దగ్గర పట్టుకుని వాసన చూడటం ద్వారా కూడా తేలిగ్గా తెలుసుకోవచ్చు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.