Tips for Better Sleep: మీరు ఆ అలవాట్లకు దూరంగా ఉంటే.. నిద్రలేమి సమస్య ఫసక్

| Edited By: Janardhan Veluru

Nov 15, 2022 | 10:24 AM

Healthy Sleep Tips: నిర్ణీత సమాయానికంటే తక్కువ పడుకున్నా, ఎక్కువుగా పడుకున్నా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికి కొన్ని గ్రామాల్లో అయితే ఎనిమిది గంటల లోపే భోజనాలు కానిచ్చి..

Tips for Better Sleep: మీరు ఆ అలవాట్లకు దూరంగా ఉంటే.. నిద్రలేమి సమస్య ఫసక్
Sleeping
Follow us on

పడుకునే ముందు ఉదయం త్వరగా లేవాలని అలారం పెట్టి మరీ పడుకుంటారు. కాని చాలా మంది అలారం మోగుతూ ఉన్నా సరే కాసేపు ఆగి లేద్దాం అని బద్ధకిస్తూ ఉంటారు. ఇలా గంటలు గడిచినా నిద్ర పోతూనే ఉంటాం. దీంతో కాలేజీకో, ఆఫీసుకో టైమ్ అయిపోతూ ఉంటుంది. ఇక ఇంట్లో వారు సుప్రభాతం మొదలుపెడితే నెమ్మదిగా లేచి.. హడావుడిగా రెడీ అవడం మొదలుపెడతాం. ఒకరోజులో కనీసం 7 నుంచి 8 గంటలకు తక్కువ కాకుండా నిద్ర పోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మొబైల్ ఫోన్లు లేదా కంప్యూటర్ స్క్రీన్ లకు అతుక్కుని కావల్సినంత సమయం పడుకోవడం లేదు. కొంతమంది అయితే నిర్ణీత సమయానికి కంటే ఎక్కువుగా నిద్రపోతున్నారు. నిర్ణీత సమాయానికంటే తక్కువ పడుకున్నా, ఎక్కువుగా పడుకున్నా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికి కొన్ని గ్రామాల్లో అయితే ఎనిమిది గంటల లోపే భోజనాలు కానిచ్చి.. 9 గంటలకు నిద్రపోతారు. ఉదయమే 5 గంటలకు లేచి.. వారి వారి పనుల్లో మునిగిపోతుంటారు. ముఖ్యంగా వ్యవసాయం చేసే వారి కుటుంబాల్లో అయితే ఈపద్ధతిని తప్పకుండా పాటిస్తారు. ఉదయం కాగానే పొలం వెళ్లాల్సి ఉంటుంది కావున.. రాత్రి 9గంటల లోపే నిద్రపోతారు. ఇలాంటి వారు ఎంతో ఆరోగ్యంగానూ ఉంటారు.

ప్రస్తుతం మారుతున్న లైఫ్ స్టైల్ లో రాత్రి 12 అయినా ఫోను స్క్రీన్ లకు అతుక్కుపోతున్నారు ముఖ్యంగా యువత. దీంతో ఉదయం లేవడానికి బద్ధకిస్తున్నారు. దీంతో చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఓ వ్యక్తి జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒక రెండు రోజులు సరిగ్గా నిద్రపోకపోతే వెంటనే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు. ప్రతి వ్యక్తి ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతే దానిని తక్కువ నిద్ర అని, ఎనిమిది గంటల కంటే ఎక్కవ నిద్ర పోతే దానిని ఎక్కువ నిద్ర అని అంటారు. ఈరెండింటిలో ఏది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే నిర్ణీత సమయం నిద్రపోవాలి. ఉదయం త్వరగా లేవకపోవడానికి, మన బద్ధకానికి కారణం నిర్ణీత సమయం నిద్రపోకపోవడమే. మన నుంచి బద్ధకాన్ని దూరం చేసి అనుకున్న టైమ్ కి లేవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

నిర్ణీత సమయం నిద్రపోవడం

ఇవి కూడా చదవండి

మన వయస్సు, ఆరోగ్య సామర్థ్యాన్ని బట్టి కనీసం ఏడు గంటలకు తక్కువ కాకుండా నిద్ర పోవాలి. అలా చేస్తే శరీరానికి కావల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. ఉదయం మనం లేవాల్సిన సమయం ముందే అనుకుంటే దానికి అనుగుణంగా మన నిద్రను ప్లాన్ చేసుకోవాలి. అయితే రాత్రి 11 గంటల లోపే నిద్ర పోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొంత మంది ఎక్కువ సేపు మొబైల్ స్క్రీన్ లకు అతుక్కుని నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ప్రతి రోజూ పడుకునే ముందు మొబైల్ తో కొంత సమయం గడపడం కొంతమందికి అలవాటుగానూ మారిపోతుంది. అయితే పడుకునే ముందు మొబైల్స్ ను దూరం పెట్టి త్వరగా పడుకోవడం కొద్ది రోజుల పాటు ప్రాక్టీస్ చేస్తే.. ఆవిధానానికి మన శరీరం అలవాటుపడుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. అనుకున్న సమయానికి లేవచ్చు.

వ్యాయామం

సాధారణంగా ఉదయం త్వరగా లేచినా ఏం చేయాలిలే.. ఇంకా ఆఫీసుకు, కాలేజీకి వెళ్లడానికి టైం ఉంది కదా అనే ఉద్దేశంతో బద్ధకంగా ఉండి.. లేవడాన్ని వాయిదా వేస్తూ వస్తారు. అందుకే ప్రతి రోజూ ఉదయం వాకింగ్, వ్యాయమం చేయడాన్ని అలవాటు చేసుకుంటే. తప్పనిసరిగా ఉదయం త్వరగా లేవడానికి అలవాటుపడతారు. వ్యాయామం చేయడం ఆరోగ్యకరం కూడా. వాకింగ్, వ్యాయమం చేయడం ద్వారా ఆవ్యక్తి ఆరోజంతా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగానూ ఉంటారు. ముఖ్యంగా శరీర భాగాలు చురుగ్గా పనిచేస్తాయి. బద్ధకం మనిషి నుంచి దూరమవుతుంది.

మొబైల్ స్క్రీన్ లకు దూరంగా

ఓ వ్యక్తి నిర్ణీత సమయం నిద్రపోకుండా చేస్తున్నవాటిలో మొదటిది మొబైల్. యువత ఎక్కువ మంది మొబైల్ ను అవసరానికి వాడటం కంటే కూడా దానికి బానిసలు అయిపోతున్నారు. దీంతో ఇంట్లో పిల్లలు కూడా మొబైల్ వాడకానికి అలవాటుపడిపోతున్నారు. చిన్న వయసు నుంచే వారు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడంతో మొబైల్స్ అనేవి వారి జీవితంలో భాగం అయిపోతున్నాయి. పడుకునే ముందు మొబైల్స్ స్క్రీన్ లకు అతుక్కుపోవడం వల్ల వాటిపై ఎంత టైం గడుపుతున్నామో కూడా తెలియక, మనం నిద్రపోయే సమయాన్ని తగ్గించుకుంటున్నాం. దీంతో ఉదయం సమయానికి లేవలేక, బద్ధకంగా తయారవుతున్నారు. పడుకునే ముందు మొబైల్ ఫోన్ల వాడకాన్ని తగ్గించడం ద్వారా ఉదయం అనుకున్న సమయానికి నిద్ర లేవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

పనిని ముందే ప్లాన్ చేసుకోవడం

వ్యాయమం చేయడం అలవాటు లేని వారు చాలా లేట్ గా లెగుస్తూ ఉంటారు. అయితే ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలో ముందురోజే ప్లాన్ చేసుకోవాలి. అలాచేయడం ద్వారా తప్పనిసరిగా ఆపని చేయాలనే ఆలోచన మొదలై అనుకున్న టైంకి లేవడం అలవాటు అవుతుంది. ఏ పని లేదనుకునేవారు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. కొత్త భాష లేదా పిల్లలు అయితే చిత్రలేఖనం వంటివి నేర్చుకోవడం అలవాటు చేసుకుంటే తద్వారా ఆపని చేయడం కోసం బద్ధకాన్ని దూరం చేసి త్వరగా నిద్రలేవచ్చు.

మంచి బ్రేక్ ఫాస్ట్

ఉదయం త్వరగా లేవడం వల్ల ఆకలి కూడా బాగా వేస్తుంది. లేచిన సమయానికి తినే సమయానికి ఎక్కువుగా గ్యాప్ లేకుండా చూసుకోవాలి. అలాగే మంచి పోషకాహారాలు ఉన్న ఆహారాన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. దీంతో పాటు ఆరోజంతా ఆ వ్యక్తి యాక్టివ్ గా ఉండొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..