ఎదుటివారు అబద్ధం చెప్తున్నారా..? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా కనిపెట్టేయండి..
మనుషుల ప్రవర్తనను అంచనా వేయడం ఒక కళ. ముఖ్యంగా ఒక వ్యక్తి నిజం మాట్లాడుతున్నాడా లేక అబద్ధాలతో బురిడీ కొట్టిస్తున్నాడా అనేది తెలుసుకోవడం ప్రస్తుత రోజుల్లో చాలా అవసరం. కొంచెం గమనించే శక్తి ఉంటే చాలు.. అబద్ధాలకోరులను ఈజీగా కనిపెట్టేయొచ్చు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఎదుటివారు చెప్పేది నిజమేనా?.. ఈ డౌట్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది. వ్యాపారంలో పార్ట్‌నర్స్, ఆఫీసులో సహోద్యోగులు లేదా వ్యక్తిగత జీవితంలో స్నేహితులు.. ఎవరైనా మనల్ని మోసం చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఉంటుంది. దీని కోసం లై డిటెక్టర్ టెస్టులు అవసరం లేదు. సైకాలజీ ప్రకారం.. ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నప్పుడు వారి బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరులో కొన్ని స్పష్టమైన మార్పులు వస్తాయి. కొంచెం గమనించే శక్తి ఉంటే చాలు, ఆ అబద్ధాలకోరులను ఈజీగా పసిగట్టేయవచ్చు. ఆ అద్భుతమైన సైకలాజికల్ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రవర్తనలో ఆకస్మిక మార్పు
సాధారణంగా కళ్లు తిప్పడాన్ని మాత్రమే అబద్ధానికి సంకేతంగా భావిస్తారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. నిజమైన మార్పు వారి హావభావాలలో కనిపిస్తుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వ్యక్తి.. మీరు ఏదైనా అడగగానే అకస్మాత్తుగా కంగారుపడినా లేదా తానేమీ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి అతిగా ప్రశాంతంగా ఉన్నట్లు నటించినా అక్కడ ఏదో తేడా ఉందని గ్రహించాలి.
కథలో పొంతన ఉండదు
నిజం చెప్పే వ్యక్తిని ఆ సంఘటన గురించి ఎన్నిసార్లు, ఎప్పుడు అడిగినా ఒకే విషయాన్ని స్పష్టంగా చెబుతారు. కానీ అబద్ధం చెప్పే వారికి వారు సృష్టించిన తప్పుడు కథను గుర్తుంచుకోవడం కష్టం. సమయం గడిచేకొద్దీ వారు చెప్పే మాటలు మారుతుంటాయి. ముందు చెప్పిన దానికి, తర్వాత చెప్పే దానికి మధ్య అస్సలు లింక్ ఉండదు.
బాడీ లాంగ్వేజ్.. చూపుల్లో తేడా
అబద్ధం చెప్పేటప్పుడు మనస్సులో తెలియని భయం, నెర్వస్‌నెస్ ఉంటాయి. దీనివల్ల వారు పదే పదే ముఖాన్ని తాకడం, ముక్కు తడుముకోవడం, కర్చీఫ్‌తో తుడుచుకోవడం లేదా చేతిలో ఉన్న వస్తువులతో ఆడుకోవడం వంటివి చేస్తారు. కొందరు కళ్లలోకి చూడటానికి భయపడితే.. మరికొందరు తాము చెప్పే అబద్ధాన్ని నమ్మించడానికి రెప్పవాల్చకుండా తీక్షణంగా కళ్లలోకి చూస్తారు. ఈ అతి చూపు కూడా అబద్ధానికి సంకేతమే.
ఆలోచించడానికి టైమ్ గ్యాప్
నిజం చెప్పడానికి మెదడు పెద్దగా శ్రమించక్కర్లేదు, కానీ అబద్ధాన్ని సృష్టించడానికి మెదడుకు చాలా పని ఉంటుంది. అందుకే మీరు అడిగిన వెంటనే సమాధానం చెప్పకుండా.. మీరు అడిగిన ప్రశ్ననే మళ్లీ మిమ్మల్ని అడగడం, నత్తిగా మాట్లాడటం లేదా ‘‘అదా.. అది వచ్చి..’’ అంటూ కాసేపు టైమ్ తీసుకోవడం చేస్తారు. ఆ గ్యాప్‌లో వారు కొత్త అబద్ధాన్ని అల్లుతుంటారన్నమాట.
అడగని విషయాలకు అనవసర వివరణలు
అబద్ధాలకోరులు తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తారు. మీరు అడగని విషయాలను కూడా పూసగుచ్చినట్లు, అతిగా వివరిస్తారు. చిన్న విషయానికి కూడా ఎక్కువగా స్పందిస్తూ, మిమ్మల్ని నమ్మించడానికి లాజిక్కులు మాట్లాడుతుంటే వారు ఏదో పెద్ద విషయాన్ని దాస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
కృత్రిమ భావోద్వేగాలు
సహజమైన నవ్వు లేదా కోపం మాటలతో పాటే ముఖంలో కనిపిస్తాయి. కానీ అబద్ధం చెప్పేవారిలో భావోద్వేగాలు ప్లాస్టిక్ లాగా కృత్రిమంగా ఉంటాయి. ఉదాహరణకు.. వారు మాట్లాడిన కాసేపటికి నవ్వడం లేదా బలవంతంగా నవ్వడం వంటివి గమనించవచ్చు. వారి కళ్లలో కనిపించే సీరియస్‌నెస్, పెదవుల పై ఉండే నవ్వుతో అస్సలు మ్యాచ్ అవ్వదు.
గమనిక: ఈ సూచనలు కేవలం ఎదుటివారి ప్రవర్తనను అంచనా వేయడానికి మాత్రమే. ఒక వ్యక్తి సిగ్గుపడే స్వభావం, భయం లేదా మానసిక ఒత్తిడి వల్ల కూడా కొన్నిసార్లు ఇలాంటి ప్రవర్తన రావచ్చు. కాబట్టి కేవలం ఒక సంకేతాన్ని బట్టే కాకుండా అన్ని కోణాల్లో ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం మంచిది.
