AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్ తెలిస్తే చాలు..

నిమ్మకాయలు తెచ్చిన రెండు రోజులకే ఎండిపోయి పాడైపోతున్నాయా? ఇకపై ఆ బాధే అక్కర్లేదు.. నిమ్మకాయల సహజ రుచి, రసం ఏమాత్రం తగ్గకుండా నెల రోజుల పాటు తాజాగా ఉంచుకోవచ్చు. అయితే అది ఎలా అనేది చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించి వంటింటి ట్రిక్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్ తెలిస్తే చాలు..
How To Keep Lemons Fresh For A Month
Krishna S
|

Updated on: Sep 11, 2026 | 5:39 PM

Share

మన దేశంలో నిమ్మకాయలు లేని వంటిల్లు ఉండడం చాలా తక్కువ. నాన్‌వెజ్ ఉంటే దాంతో పాటే నిమ్మకాయ ఉండాల్సిందే.  మార్కెట్ నుంచి ఎక్కువ మొత్తంలో నిమ్మకాయలు తెచ్చినప్పుడు వాటిని తాజాగా ఉంచడం పెద్ద సవాలే. బుట్టలో అలాగే వదిలేస్తే రెండు మూడు రోజుల్లోనే రంగు మారి ఎండిపోతాయి. ఫ్రిజ్‌లో పెట్టినా కొన్ని రోజులకే తొక్కపై గోధుమ రంగు మచ్చలు వచ్చి రసం తగ్గిపోతుంది. నిమ్మకాయల సహజ రుచి, రసం తగ్గకుండా నెల రోజుల పాటు తాజాగా ఉంచేందుకు ఉపకరించే మూడు అద్భుతమైన నిల్వ పద్ధతులను ప్రముఖ ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంజలి పంచుకున్నారు.

నిమ్మకాయలను తాజాగా ఉంచే 3 సులభమైన పద్ధతులు

నీటి జాడీ పద్ధతి: ఒక శుభ్రమైన, ఎయిర్‌టైట్ గాజు సీసాలో నిమ్మకాయలను వేసి, అవి పూర్తిగా మునిగేలా నీటితో నింపాలి. మూత గట్టిగా పెట్టి ఫ్రిజ్‌లో భద్రపరిస్తే నిమ్మకాయలు దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు తాజాగా, రసభరితంగా ఉంటాయి.

నూనె పూత పద్ధతి: నిమ్మకాయల తొక్కపై కొద్దిగా ఆవనూనెను పలుచగా రాయాలి. ఇలా చేయడం వల్ల గాలిలోని తేమ తొక్కపై నేరుగా ప్రభావం చూపదు. ఆ తర్వాత వాటిని ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. వాడుకునే ముందు నీటితో కడిగి ఉపయోగిస్తే సరిపోతుంది.

పేపర్ లేదా టిష్యూ పద్ధతి: ప్రతి నిమ్మకాయను విడివిడిగా ఒక టిష్యూ పేపర్‌లో లేదా న్యూస్ పేపర్‌లో గట్టిగా చుట్టాలి. ఆ తర్వాత వాటన్నింటినీ ఒక గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. ఈ పద్ధతి ద్వారా నిమ్మకాయలు నెల రోజులైనా వాడిపోకుండా, మచ్చలు పడకుండా తాజాగా ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు.. జాగ్రత్తలు

విటమిన్-సి పుష్కలంగా ఉండే నిమ్మకాయతో రోజువారీ ఆరోగ్యాన్ని ఎన్నో రకాలుగా మెరుగుపరుచుకోవచ్చు:

మెరుగైన జీర్ణక్రియ: గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, అల్లం రసం, కొద్దిగా నల్ల ఉప్పు కలుపుకుని తాగితే గ్యాస్ సమస్యలు తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

బరువు నియంత్రణ: ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగడం శరీర మెటబాలిజాన్ని పెంచి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

రోగనిరోధక శక్తి: ఇందులోని విటమిన్-సి శరీర రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

చర్మానికి రక్షణ: చర్మంపై మచ్చలు, ట్యానింగ్ తగ్గించడానికి నిమ్మరసం ఉపయోగపడుతుంది. అయితే నిమ్మరసంలోని ఆమ్ల గుణం వల్ల దాన్ని నేరుగా ముఖంపై రాయకూడదు. కలబంద లేదా రోజ్ వాటర్‌తో కలిపి మాత్రమే ఉపయోగించాలి.

Follow Us