AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. సంచలన విషయాలు బయటపెట్టిన డీజీపీ!

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మాజీ సైనికుడు మల్లేష్ కీలక నిందితుడిగా గుర్తించబడ్డాడు. చోరీకి గురైన ఆయుధాలు రికవరీ అయ్యాయి. మల్లేష్ పాకిస్తాన్ వెపన్ డీలర్‌తో సోషల్ మీడియా లింక్ కలిగి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటన ఆయుధాగార భద్రతపై ప్రశ్నలు లేవనెత్తగా, చోరీ వెనుక పూర్తి ఉద్దేశం, నెట్‌వర్క్‌పై విచారణ కొనసాగుతోంది.

బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. సంచలన విషయాలు బయటపెట్టిన డీజీపీ!
Hyderabad Army Armory Theft
Balaraju Goud
|

Updated on: Sep 11, 2026 | 5:38 PM

Share

హైదరాబాద్: బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీకి గురైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి మల్లేష్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. చోరీకి గురైన ఆయుధాలను కూడా దర్యాప్తు అధికారులు రికవరీ చేసినట్లు వెల్లడించారు.

ఆగస్టు 30న చివరిసారిగా ఆయుధాలను తనిఖీ చేసినప్పుడు అన్నీ సక్రమంగానే ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది. ఆ తర్వాత ఆర్మీ ఆయుధాగారంలోని తాళాలు పగులగొట్టి ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమైన విషయం ఆగస్టు 31న వెలుగులోకి వచ్చింది. తొలుత ఈ ఘటనలో బయట వ్యక్తుల ప్రమేయం ఉందా? లేక లోపలి వ్యక్తుల సహకారంతోనే చోరీ జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు సాగింది. దర్యాప్తులో భాగంగా మల్లేష్ కదలికలపై నిఘా పెట్టిన అధికారులు సాంకేతిక ఆధారాలను సేకరించినట్లు డీజీపీ వెల్లడించారు. క్రమశిక్షణా కారణాలతో మల్లేష్ గతంలో ఆర్మీ నుంచి తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు.

మల్లేష్ ఆగస్టు 28, 29 తేదీల్లో బొల్లారం ఆయుధాగారం పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. రాత్రి సమయంలో సీసీ కెమెరాల నిఘా తక్కువగా ఉన్న ప్రాంతాలను పరిశీలించినట్లు గుర్తించామన్నారు. ఆగస్టు 30న కార్గిల్ గేట్ వైపు నుంచి లోపలికి ప్రవేశించి, చీకటిని ఉపయోగించుకుని ఆయుధాగారం వద్దకు చేరుకున్నట్లు డీజీపీ వివరించారు.ఆయుధాలు, మందుగుండు సామగ్రి నిల్వ చేసే ప్రాంతంలో తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు దర్యాప్తులో తేలినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆయుధాలను బయటకు తీసుకెళ్లిన అనంతరం కారులో అచ్చంపేటకు తరలించినట్లు వెల్లడించారు.

అక్కడ తన ఇంటి సమీపంలోని గడ్డివాములో ఆయుధాలను దాచినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు వివరించారు. అనంతరం ప్రత్యేక బృందాలు నిర్వహించిన తనిఖీల్లో చోరీకి గురైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. బొల్లారం ఆర్మీ కేంద్రం నుంచి నాలుగు AK-203 రైఫిళ్లు, ఒక INSAS రైఫిల్, ఆరు 9ఎంఎం పిస్టళ్లు, ఒక సివిలియన్ పిస్టల్‌తో పాటు మ్యాగజైన్లు, మందుగుండు సామగ్రి మాయమైనట్లు తొలిదశలో నమోదైన వివరాలు చెబుతున్నాయి.

పాకిస్థాన్ వెపన్ డీలర్‌తో సోషల్ మీడియా లింక్?

ఇక ఈ కేసు దర్యాప్తులో మరో కీలక అంశం తెరపైకి వచ్చినట్లు సమాచారం. మల్లేష్ సోషల్ మీడియా ఖాతాలను దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతానికి చెందిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి విక్రేతకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మల్లేష్ ఫాలో అవుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆ ఖాతాలో షాట్‌గన్స్, AK-47 తదితర తుపాకులకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చోరీ చేసిన ఆయుధాలను విక్రయించే ఉద్దేశంతోనే ఈ నేరానికి పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి.

మల్లేష్ నేపథ్యంపైనా దృష్టి

నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్ల గ్రామానికి చెందిన మల్లేష్ కుటుంబ నేపథ్యాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అచ్చంపేటలోని సాయినగర్‌లో మల్లేష్ తండ్రి నారాయణ నివాసం ఉంటున్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం మల్లేష్ తల్లి మరణించడంతో అతను సెలవులో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత తరచూ తండ్రి వద్దకు వచ్చి వెళ్తున్నట్లు స్థానికుల ద్వారా పోలీసులు వివరాలు సేకరించారు. అదే సమయంలో నాగర్‌కర్నూల్ పట్టణంలోని బీసీ కాలనీలో మల్లేష్ కొత్త ఇంటి నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. అతని ఆర్థిక పరిస్థితి, ఇటీవల జరిగిన లావాదేవీలు, పరిచయాలు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

ఆయుధాగార భద్రతపై ప్రశ్నలు

ఈ చోరీ ఘటనతో బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం భద్రతపై కూడా తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి. అత్యంత భద్రత కలిగిన సైనిక ప్రాంతంలోకి ప్రవేశించి ఆయుధాలను బయటకు తరలించడం ఎలా సాధ్యమైందన్న అంశంపై ఆర్మీ, మిలిటరీ ఇంటెలిజెన్స్, పోలీసులు విచారణ చేపట్టారు. తొలిదశలో ఆయుధాగారానికి అనుమతి ఉన్న సిబ్బందిని ప్రశ్నించడంతో పాటు సీసీటీవీ ఫుటేజీలు, ప్రవేశ-నిష్క్రమణ రికార్డులు, ఆయుధాల జారీ-స్వీకరణ రిజిస్టర్లను పరిశీలించారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా దర్యాప్తులో చేరినట్లు గతంలో అధికారిక వర్గాలు తెలిపాయి.

మొత్తం ఆయుధాలు రికవరీ

చోరీకి గురైన ఆయుధాలను రికవరీ చేయడంతో దర్యాప్తులో కీలక పురోగతి సాధించినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అయితే ఈ ఆయుధాల చోరీ వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? మల్లేష్ ఒక్కడే ఈ వ్యవహారాన్ని నడిపించాడా? అతనికి మరెవరైనా సహకరించారా? చోరీ చేసిన ఆయుధాలను ఎక్కడికి తరలించాలనుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు చెందిన ఆయుధాల విక్రేతలతో ఏమైనా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా? అనే అంశం నిజమని తేలితే కేసు మరింత సీరియస్‌గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.

మొత్తానికి.. బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మాజీ ఆర్మీ ఉద్యోగి మల్లేష్‌ను నిందితుడిగా గుర్తించడం, సాంకేతిక ఆధారాలతో అతని కదలికలను ట్రాక్ చేయడం, అచ్చంపేటలో ఆయుధాలను రికవరీ చేయడం దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. అయితే చోరీ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్, ఉద్దేశం, ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు అధికారిక నిర్ధారణ కోసం వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us