ఒక్క నిమిషంలో గ్యాస్ స్టవ్ బర్నర్లు మెరిసిపోతాయ్.. జస్ట్ ఇలా చేస్తే మంట కూడా ఫుల్‌గా..
వంటగదిలో గ్యాస్ స్టవ్ జిడ్డుగా మారింది. బర్నర్లు సరిగ్గా వెలగక ఇబ్బంది పడుతున్నారా? అయితే మార్కెట్లో దొరికే ఖరీదైన లిక్విడ్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు.. మీ ఇంట్లో ఉండే బేకింగ్ సోడా, నిమ్మరసంతో మొండి జిడ్డు మరకలను నిమిషాల్లో ఎలా వదిలించాలో.. గ్యాస్ స్టవ్‌ను తళతళా మెరిపించే ఆ రహస్య చిట్కాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వంటగది పరిశుభ్రత అనేది ఇంటిల్లిపాది ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. రోజూ వంట చేసే క్రమంలో గ్యాస్ స్టవ్‌పై నూనె చిమ్మడం, పాలు లేదా కూరలు పొంగడం వల్ల జిడ్డు, నల్లటి మొండి మరకలు పేరుకుపోవడం సహజం. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే స్టవ్ అందవిహీనంగా మారడమే కాకుండా బర్నర్ రంధ్రాలు మూసుకుపోయి గ్యాస్ వృథా అవుతుంది. అయితే మార్కెట్లో లభించే ఖరీదైన, ఘాటైన కెమికల్స్ వాడకుండానే వంటింట్లో ఉండే సహజ పదార్థాలతో గ్యాస్ స్టవ్‌ను, బర్నర్లను తళతళా మెరిపించే సులువైన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
వంట పూర్తై స్టవ్ పూర్తిగా చల్లారిన తర్వాత దానిపై ఉండే ఐరన్ స్టాండ్లు, బర్నర్లను విడివిడిగా తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌టాప్‌పై ఉన్న జిడ్డు మరకలను తొలగించడానికి బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్‌పై, మరకలు ఉన్న ప్రాంతాల్లో పూసి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మెత్తటి స్పాంజ్ లేదా స్క్రబ్బర్‌తో సున్నితంగా రుద్దితే ఎంతటి గట్టి మరకలైనా సులభంగా వదిలిపోతాయి. చివరగా తడి గుడ్డతో క్షుణ్ణంగా తుడుచుకుంటే స్టవ్ కొత్తదానిలా మెరుస్తుంది.
మరోవైపు బర్నర్ల రంధ్రాల్లో నూనె, బూడిద పేరుకుపోవడం వల్ల మంట సరిగ్గా రాక పసుపు రంగులోకి మారుతుంది. దీనివల్ల గ్యాస్ ఎక్కువగా ఖర్చవుతుంది. బర్నర్ల అడ్డంకులను తొలగించడానికి ఒక గిన్నెలో వేడినీళ్లు తీసుకుని, అందులో రెండు స్పూన్ల బేకింగ్ సోడా, అరకప్పు వెనిగర్ లేదా నిమ్మరసం కలపాలి. అందులో ఇత్తడి బర్నర్లను 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. అనంతరం పాత టూత్‌బ్రష్‌తో రుద్ది, రంధ్రాలలో ఇరుక్కున్న మురికిని సేఫ్టీ పిన్ లేదా సన్నటి తీగతో సున్నితంగా తొలగించాలి.
శుభ్రం చేసిన బర్నర్లు, స్టాండ్లను మంచి నీటితో కడిగి, తేమ పూర్తిగా పోయేంత వరకు ఎండలో లేదా గాలికి ఆరబెట్టాలి. బర్నర్లలో ఏమాత్రం తడి ఉన్నా మంట సరిగ్గా వెలగదు. పూర్తిగా ఆరిన తర్వాత వాటిని యథావిధిగా స్టవ్‌పై అమర్చి వెలిగిస్తే, అడ్డంకులు తొలగిపోయి ఏకరీతిగా నీలి రంగు మంట వస్తుంది. వారానికి ఒక్కసారి ఈ సులభమైన పద్ధతిని పాటిస్తే స్టవ్ మన్నిక పెరగడంతో పాటు గ్యాస్ కూడా గణనీయంగా ఆదా అవుతుంది.
