పూరీలకు ఏ నూనె వాడితే మంచిది..? తెలియక అందరూ చేసే తప్పులు ఇవే..
వంటింట్లో పూరీలు వేయించేటప్పుడు నూనె ఎంపిక అత్యంత కీలకం. నాలుకకు అమృతంలా అనిపించే ఈ పూరీలను వేయించడానికి మీరు ఎలాంటి నూనె వాడుతున్నారు? తప్పుడు నూనె ఎంచుకుంటే రుచి మారడమే కాదు.. గుండె ఆరోగ్యానికీ ముప్పే.. డీప్ ఫ్రై చేసినా ఆరోగ్యానికి పెద్దగా హాని కలగకుండా ఉండేందుకు నిపుణులు సూచిస్తున్న బెస్ట్ ఆయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పండుగలు, వేడుకలు వచ్చాయంటే చాలు.. వంటింట్లో ఘుమఘుమలాడే వేడివేడి పూరీలు తప్పనిసరిగా ఉండాల్సిందే. బంగారు వర్ణంలో పొంగే పూరీలు నాలుకకు ఎంత రుచిని ఇస్తాయో, వాటిని వేయించడానికి వాడే నూనె ఎంపిక కూడా ఆరోగ్యపరంగా అంతే కీలకం. సాధారణంగా డీప్ ఫ్రై చేసిన ఆహారాలను రోజూ తినడం మంచిది కానప్పటికీ, పండుగల వేళ అప్పుడప్పుడు పూరీలను లాగించడంలో తప్పులేదు. అయితే పూరీలను కాల్చడానికి అధిక స్మోకింగ్ పాయింట్ ఉన్న సరైన నూనెను ఎంచుకుంటే రుచితో పాటు ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది.
రైస్ బ్రాన్ ఆయిల్
పూరీలను వేయించడానికి రైస్ బ్రాన్ ఆయిల్ చాలా అనుకూలమైన ఎంపిక. దీని స్మోకింగ్ పాయింట్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల అధిక ఉష్ణోగ్రతల వద్ద డీప్ ఫ్రై చేసినా నూనె త్వరగా పాడవదు. ఇందులో ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులతో పాటు స్వల్ప పరిమాణంలో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఈ నూనెకు ప్రత్యేకమైన ఘాటైన వాసన ఉండదు కాబట్టి, పూరీల సహజ రుచి దెబ్బతినకుండా ఉంటుంది.
సాంప్రదాయ దేశీ నెయ్యి
పండుగల పూట స్వచ్ఛమైన దేశీ నెయ్యిలో వేయించిన పూరీలు అత్యంత రుచికరంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం దేశీ నెయ్యి జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. నెయ్యికి స్మోకింగ్ పాయింట్ చాలా ఎక్కువ కాబట్టి అధిక వేడి వద్ద సురక్షితంగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. పండుగ రోజుల్లో ప్రత్యేకమైన విందు కోసం నెయ్యితో చేసిన పూరీలను నిరభ్యంతరంగా ఆస్వాదించవచ్చు.
శుద్ధి చేసిన ఆలివ్ నూనె
ఆలివ్ నూనె అంటే సాధారణంగా సలాడ్లకు మాత్రమే వాడతారని అనుకుంటారు. కానీ రిఫైన్డ్ ఆలివ్ నూనె డీప్ ఫ్రైయింగ్‌కు చక్కగా సరిపోతుంది. దీని స్మోకింగ్ పాయింట్ సుమారు 465°F వరకు ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. డీప్ ఫ్రైయింగ్ కోసం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌ను అస్సలు వాడకూడదు. దీని స్మోకింగ్ పాయింట్ తక్కువగా ఉండటం వల్ల వేడికి త్వరగా విచ్ఛిన్నమవుతుంది. కేవలం శుద్ధి చేసినఆలివ్ ఆయిల్‌ను మాత్రమే ఉపయోగించాలి.
కుసుమ నూనె
అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే స్థిరత్వం కుసుమ నూనె సొంతం. దీనికి స్మోకింగ్ పాయింట్ అధికంగా ఉంటుంది. ఈ నూనెకు ఎలాంటి ప్రత్యేక రుచి గానీ, వాసన గానీ ఉండదు. అందువల్ల పూరీలు క్రిస్పీగా, రుచిగా రావడానికి ఇది చక్కటి ఎంపిక.
శుద్ధి చేసిన కొబ్బరి నూనె
డీప్ ఫ్రైయింగ్‌కు రిఫైన్డ్ కొబ్బరి నూనెను కూడా వినియోగించవచ్చు. ఇది సంతృప్త కొవ్వులతో కూడి ఉండి, అధిక స్మోకింగ్ పాయింట్‌ను కలిగి ఉంటుంది. అయితే కొబ్బరి నూనె స్వతహాగా కాస్త ప్రత్యేకమైన వాసనను కలిగి ఉండటం వల్ల ఆ ఫ్లేవర్ అందరికీ నచ్చకపోవచ్చు. ఆ రుచిని ఇష్టపడేవారు దీనిని ఎంచుకోవచ్చు.
డీప్ ఫ్రై చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్య నియమాలు:
మళ్లీ మళ్లీ వేడి చేయవద్దు: పూరీలు వేయించగా మిగిలిన నూనెను పదేపదే మరిగించి వాడటం ఏమాత్రం మంచిది కాదు. ఇది శరీరంలో విషతుల్యాలను, చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
అదనపు నూనెను తొలగించండి: పూరీలను నూనెలో నుంచి తీసిన వెంటనే టిష్యూ పేపర్‌పై ఉంచితే అదనపు నూనెను పీల్చుకుంటుంది.
నూనెను అతిగా కాల్చవద్దు: నూనె పొగలు కక్కే స్థాయికి చేరకముందే మంటను అదుపులో ఉంచుకోవాలి.
గుండె సమస్యలు ఉన్నవారు: గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు డీప్ ఫ్రై ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి లేదా వైద్యుల సలహా మేరకే మితంగా తీసుకోవాలి.
