
పండ్లు మన శరీరానికి మంచివని అందరికీ తెలుసు. ప్రతిరోజ పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో పండ్లను చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తారు. కొన్నిసార్లు మనం పండ్లను కోసి అలాగే ఉంచుతాం. ఆఫీసులు, ఏదైన ప్రయాణ సమయాల్లో కోసి తీసుకెళ్తుంటారు. కొంతమంది కోసి ఫ్రిజ్‌లో పెడతారు. కొన్ని గంటల తర్వాత వాటిని తింటారు. కానీ కోసిన పండ్లను ఎంతసేపట్లో తినాలి..? అవి ఎంతకాలం మంచిగా ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
కోసిన వెంటనే పండ్లు చెడిపోవు. కానీ వాటిని ఎంత త్వరగా తింటే అంత మంచిది. నిజానికి కోసిన పండ్లలో ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. వేసవి, వర్షాకాలం సూక్ష్మజీవుల పెరుగుదలకు ఉత్తమ సమయాలు. ఈ సీజన్లలో కోసిన పండ్ల వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు నిల్వ చేయకుండా వీలైనంత త్వరగా వాటిని తినాలి. పండ్ల నుండి అన్ని పోషకాలను పొందడానికి వాటిని కోసిన అరగంటలోపు తినడం ఎల్లప్పుడూ మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పండ్లను ఏ సమయంలో తిన్న మంచిదేనని నిపుణులు అంటున్నారు. అయితే కొన్నింటిని ఉదయం ఖాళీ కడుపుతో, మరికొన్నింటిని రాత్రి వేళలో తినకూడదని చెబుతారు. ఏదైనా సరే మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి..