టాటూతో తంటాలే.. ఈ ఒక్క చిన్న పొరపాటుతో ప్రాణాలకే ఎసరు..
స్టైల్ కోసం ఒంటిపై పచ్చబొట్టు పొడిపించుకుంటున్నారా? ఆ ఒక్క చిన్న ముచ్చటే మీ ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదముంది జాగ్రత్త.. ఫ్యాషన్ మత్తులో పడి పరిశుభ్రతను గాలికొదిలేస్తే.. హెపటైటిస్, హెచ్ఐవీ, తీవ్రమైన చర్మ ఇన్ఫెక్షన్ల వంటి ప్రాణాంతక రోగాలు చుట్టుముట్టే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

నేటి యువతలో టాటూలు వేయించుకోవడం ఒక క్రేజీ ట్రెండ్‌గా మారింది. తమ వ్యక్తిత్వాన్ని, భావోద్వేగాలను, నచ్చిన వ్యక్తుల పేర్లను శరీర భాగాలపై పచ్చబొట్లుగా వేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కేవలం ఫ్యాషన్ మాత్రమే చూసుకుని.. పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా శుభ్రం చేయని పరికరాలు, వాడిన సూదులనే మళ్లీ వాడటం వల్ల ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు.
టాటూ వేయించుకోవడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి?
టాటూ వేసే క్రమంలో సూది ద్వారా చర్మంలోకి ఇంక్‌ను పంపుతారు. ఈ సమయంలో చర్మంపై సూక్ష్మ గాయాలు ఏర్పడతాయి. వాడే పరికరాలు, స్టూడియో వాతావరణం పరిశుభ్రంగా లేకపోతే బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
హెపటైటిస్ బి, హెపటైటిస్ సి: ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తికి వాడిన సూదిని ఇతరులకు వాడినప్పుడు రక్తం ద్వారా హెపటైటిస్ బి, సి వైరస్‌లు శరీరంలోకి చేరతాయి. ఇవి కాలేయంపై తీవ్ర ప్రభావం చూపి, దీర్ఘకాలిక కాలేయ వ్యాధులకు కారణమవుతాయి.
హెచ్ఐవి ముప్పు: ఒకరి రక్తంతో కలుషితమైన సూదిని స్టెరిలైజ్ చేయకుండా మరొకరికి వాడితే రక్తం ద్వారా హెచ్ఐవి సంక్రమించే ప్రమాదం ఉంది. అందుకే సింగిల్ యూజ్ డిస్పోజబుల్ సూదుల వాడకం అత్యంత ముఖ్యం.
చర్మ ఇన్ఫెక్షన్లు: అపరిశుభ్ర పరికరాల వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకుతాయి. టాటూ వేసిన భాగంలో తీవ్రమైన నొప్పి, ఎర్రబడటం, వాపు, చీము పట్టడం లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఇంక్ అలర్జీ: కొందరికి టాటూ తయారీలో వాడే రసాయనాలు, ఇంక్‌లోని పదార్థాల వల్ల తీవ్రమైన అలర్జీ వస్తుంది. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, తీవ్రమైన దురద, మంట వంటి సమస్యలు వస్తాయి. ఈ అలర్జీ టాటూ వేయించుకున్న కొన్నాళ్ల తర్వాత కూడా బయటపడవచ్చు.
టాటూ వేయించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- సరైన లైసెన్స్, మంచి పేరు, పరిశుభ్రత పాటించే ప్రముఖ టాటూ స్టూడియోలను మాత్రమే ఎంచుకోవాలి.
- టాటూ ఆర్టిస్ట్ మీ ముందే సరికొత్త డిస్పోజబుల్ నీడిల్ ప్యాకెట్‌ను ఓపెన్ చేస్తున్నారో లేదో పరిశీలించాలి.
- వాడే ఇతర పరికరాలను స్టెరిలైజ్ చేశారా లేదా, ఆర్టిస్ట్ కొత్త గ్లౌవ్స్ ధరించారా లేదా అనేది గమనించాలి.
- టాటూ వేయించుకున్న తర్వాత ఆర్టిస్ట్ సూచించిన నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఆ ప్రాంతాన్ని మాటిమాటికి తాకడం మానేయాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
