ఆడవాళ్లు కాళ్లకు మెట్టెలు ఎందుకు ధరిస్తారు..? వీటి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాల గురించి మీకు తెలుసా..?

మన పూర్వీకులు చెప్పిన మాటలు ఊరికే చెప్పినవి కావని.. వాటి వెనుక పెద్ద శాస్త్రీయ కారణాలు ఉన్నాయని ఆయుర్వేద పరిశోధనలు నిరూపిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైంది ఆడవాళ్లు కాళ్లకు పెట్టుకునే వెండి మెట్టెల రహస్యం. భారతీయ సంస్కృతిలో ఆడవాళ్లు తమ కాళ్లకు వెండితో చేసిన మెట్టెలు పెట్టుకునే ఆచారం ఉంటుంది. ఇది కేవలం అందం కోసమే కాదు.. ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.

ఆడవాళ్లు కాళ్లకు మెట్టెలు ఎందుకు ధరిస్తారు..? వీటి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాల గురించి మీకు తెలుసా..?
Silver Toe Rings

Updated on: Jun 18, 2025 | 11:15 PM

గర్భాశయం, పాదాల్లోని నరాల మధ్య ఉన్న సహజ సంబంధాన్ని బట్టి.. కాళ్లకు పెట్టుకునే మెట్టెలు కొన్ని ఆరోగ్య సమస్యలను రాకుండా చేస్తాయని నమ్మకం. ముఖ్యంగా గర్భం దాల్చిన సమయంలో వచ్చే తలనొప్పులు, వాంతులు, అలసట, ఆకలి లేకపోవడం వంటి సమస్యలను తగ్గించడానికి ఇది సహాయపడుతుందట.

వెండిలో ఉండే సహజమైన మాగ్నెటిక్ శక్తి, శరీరంలోని ముఖ్యమైన నరాలపై ప్రభావం చూపి శక్తిని సమతుల్యంగా పంచుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వెండిని తాకినప్పుడు మన శరీరంలోని వేడి తగ్గిపోతుంది. రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇది నరాల పనితీరును సమతుల్యం చేస్తుంది.

గర్భిణీ స్త్రీలు రోజూ సరైన సమయంలో ఆ నరాలను చేత్తో నొక్కడం సాధ్యం కాదు. అలాంటి సమయంలో కాళ్లకు ధరించే వెండి మెట్టెల వల్ల కలిగే తక్కువ ఒత్తిడి తరచూ తగిలే స్వభావం ద్వారా.. సహజంగా రిఫ్లెక్స్ మసాజ్ లాగా పని చేస్తుంది. దీని వల్ల శరీరంలోని నాడీమండలం ఉత్సాహంగా మారి ఆరోగ్యం బాగుపడుతుంది.

నడవడం లాంటి రోజువారీ పనుల్లో ఈ మెట్టెలు పాదంలోని కొన్ని ముఖ్యమైన పాయింట్లను తాకి అక్కడ కొద్దిగా ఒత్తిడిని కలిగిస్తాయి. దీని వల్ల నాడీ వ్యవస్థ చురుకుగా మారి హార్మోన్ల సమతుల్యతతో పాటు శరీరంలోని చాలా అవయవాలకు శక్తి అందుతుంది. ఇది గర్భాశయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

కాళ్లకు పెట్టుకునే వెండి మెట్టెలలో దాగి ఉన్న రహస్యాలు.. శాస్త్రీయంగా చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇది కేవలం ఒక ఆచారమే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడే తెలివికి, తరతరాల సంప్రదాయానికి నిదర్శనం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)