
మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపకరించేది నడక. పెద్ద పెద్ద వ్యాయామాలు, డైట్లు మెయింటేన్ చేయకుండా కేవలం రోజూ కొద్ది సేపు నడవడం ద్వారా చాలా అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చని నిపుణులు సైతం చెబుతున్నారు. బరువు తగ్గడానికి కూడా ఈ నడక చాలా ఉపయుక్తంగా ఉంటుందని వివరిస్తున్నారు. అయితే అదే సమయంలో అతిగా నడిచినా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు రోజులో ఎంత సేపు నడవాలి? ఎన్ని దూరం నడవాలి. ఎలా నడవాలి? తెలుసుకుందాం రండి..
ప్రతి రోజూ 10,000 అడుగులు నడవడం హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయ పడుతుంది. అలాగే క్యాన్సర్, డెమెన్షియా వంటి వ్యాధుల నుంచి రక్షిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ప్రతిరోజూ 3,800 అడుగులు వేయడం వల్ల అభిజ్ఞా క్షీణతను 25% తగ్గించవచ్చు. అయితే మీ ఫిట్ నెస్ పరిస్థితిని బట్టి.. మీ ఆరోగ్యాన్ని మీరు రోజుకు ఎన్న అడుగులు నడవాలో నిర్ణయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు 10,000 అడుగులు వేయడం మంచి ఆరోగ్యానికి కీలకమనే అభిప్రాయం ఉన్నప్పటికీ మీ రోజు వారి దినచర్య ఆధారంగా నడవడం అనేది చాలా ముఖ్యం. మీకు అస్సలు నడక అలవాటు లేకుండా.. ప్రతి రోజూ కూర్చొనే పనిచేస్తూ ఉండే వ్యక్తి అయితే ఒకేసారి 10,000 అడుగులు నడవడం ప్రారంభిస్తే మంచి కన్నా, చెడు అధికంగా జరుగుతుంది. అందుకే దశల వారీగా నడక తీవ్రతను పెంచాలి. మొదలు పెట్టే టప్పుడు తక్కువ దూరం మాత్రమే నడవాలి. ఒక వారం 1000 అడుగులు నడిస్తే రెండో వారం 2000, ఆ తర్వాత వారం 3000 అలా పెంచుకుంటూ వెళ్లాలి. మీ శరీర తత్త్వాన్ని బట్టి మార్పులు చేసుకుంటూ వెళ్లాలి. అలాగే మీ రోజూ వారి దినచర్యలో కూడా మార్పులు చేసుకోవాలి. ఎలివేటర్ ఎక్కకుండా మెట్ల మార్గం ఎంచుకోవడం, మీ కుక్కను బయటకు వాకింగ్ కు తీసుకెళ్లడం, చిన్నచిన్న పనులకు ద్విచక్ర వాహనాలను వాడకుండా నడవడం వంటివి చేయాలి.
రోజుకు కనీసం 10,000 అడుగులు నడవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. సగటు వ్యక్తి ప్రతిరోజూ 5,000 నుంచి 7,500 అడుగులు వేస్తాడు, వారు ఎక్కువగా నిశ్చల జీవనశైలిని గడుపుతున్నప్పటికీ, మీ దినచర్యకు 30 నిమిషాల నడకను జోడించడం వల్ల అదనంగా 3,000 నుంచి 4,000 అడుగులు నడవొచ్చు. ఇది మిమ్మల్ని 10,000 అడుగుల లక్ష్యానికి చేరువ చేస్తుంది. నిశ్చల జీవనశైలి యొక్క దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి ఒక వ్యక్తి ఒక రోజులో కనీసం 2000-2200 అడుగులు వేయాలి. చాలా మంది పెద్దలకు, బిజీ షెడ్యూల్‌తో 2000 అడుగులు వేయడం లేదా 20 నిమిషాలు నడవడం కష్టంగా ఉండవచ్చు. కూర్చున్న ప్రతి 30 నిమిషాలకు 5 నిమిషాలు నడవడం వల్ల ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని, రక్తపోటును తగ్గించడానికి, అలసటను తగ్గించడానికి అలాగే మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రతి 30 నిమిషాలకు 5 నిమిషాలు నడవడం చాలా తక్కువగా అనిపించవచ్చు. కానీ మీరు రోజంతా 5 నిమిషాలు కలిపితే మీరు సగటున 40 నిమిషాలు బాగా నడవవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..