
ఈ ఆధునిక కాలంలో యువత గుండెపోటుకు బలవడం ఆందోళన కలిగిస్తుంది. గతంలో పెద్దలకే పరిమితమైన గుండపోట్లు ఇప్పుడు పిల్లలు, యవతను కబళిస్తుంది. దీనికి అనారోగ్యకరమైన జీవనశైలి కారణమని నిపుణులు అంటున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. జంక్ ఫుడ్, అధిక ఉప్పు, వేయించిన ఆహారాలు రక్త నాళాలలో కొవ్వును పెంచుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన, ధూమపానం, నిద్ర లేకపోవడం కూడా గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.
ఇలాంటి సమయంలో చిన్న జీవనశైలి మార్పులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. యోగా అనేది శరీరం, మనస్సు, గుండెపై సానుకూల ప్రభావాన్ని చూపగల అద్భుతమైన మార్గం. క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేయడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలో సహజ సమతుల్యత కాపాడుతుంది. యోగా ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్వామి రామ్‌దేవ్ కొన్ని ముఖ్యమైన ఆసనాలను సూచించారు.
స్వామి రామ్‌దేవ్ సూచించిన ఆసనాలలో సూర్య నమస్కారం ప్రధానమైనది. ఇది మొత్తం శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని ద్వారా గుండె కండరాలు బలపడతాయి. ఆక్సిజన్ శోషణ పెరుగుతుంది. అలాగే భుజంగాసనం ఛాతీని విస్తరించి గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, గుండెకు ఎక్కువ ఆక్సిజన్‌ను అందిస్తుంది.
పశ్చిమోత్తనాసనం శరీరాన్ని, నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించి, హృదయ స్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది. దండాసనం సరైన భంగిమను నిర్వహించడం ద్వారా శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని సమతుల్యం చేసి, గుండెపై అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది.
యోగతో పాటు గుండె ఆరోగ్యానికి మరికొన్ని జీవనశైలి మార్పులు అవసరం. ప్రతిరోజూ 30 నిమిషాలు చురుకైన నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. ఉప్పు, చక్కెర, వేయించిన ఆహార పదార్థాల తీసుకోవడం తగ్గించాలి. తగినంత నిద్ర పొందడం, ధూమపానం, మద్యం నుండి దూరంగా ఉండటం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఈ మార్పులను పాటించడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..