AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడిస్తే ఏమొస్తుంది అనుకుంటున్నారా.. కన్నీళ్లతో కలిగే ఈ లాభాలు తెలిస్తే..

చిన్నప్పటి నుంచి మన సమాజంలో ఏడవడాన్ని బలహీనతకు, పిరికితనానికి నిదర్శనంగానే చూస్తూ వస్తున్నారు. ముఖ్యంగా నలుగురిలో ఏడిస్తే పరువు పోతుందన్న భయంతో గుండెల్లోనే బాధను దాచేసుకునే వారు ఎందరో. కానీ, నిజానికి కన్నీళ్లు మన ఒంట్లోని విషాన్ని కడిగేసే సహజ ఔషధమని మీకు తెలుసా? ఏడ్చిన తర్వాత మనసుకు అంతటి ప్రశాంతత ఎందుకు వస్తుంది? కన్నీళ్ల వల్ల గుండె, కళ్లకు కలిగే అద్భుత ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

ఏడిస్తే ఏమొస్తుంది అనుకుంటున్నారా.. కన్నీళ్లతో కలిగే ఈ లాభాలు తెలిస్తే..
Health Benefits Of Crying
Krishna S
|

Updated on: Oct 24, 2026 | 6:33 PM

Share

కన్నీళ్లు పెట్టుకుంటే పిరికివారు అనుకుంటారనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ, నవ్వు ఎంతటి సహజమైన ఆరోగ్య ఔషధమో.. ఏడవడం కూడా అంతే శక్తివంతమైన హీలింగ్ థెరపీ అని సైన్స్ స్పష్టం చేస్తోంది. నవ్వులాగే ఏడవడం కూడా మనుషుల సహజ భావోద్వేగ ప్రక్రియ. తీవ్రమైన దుఃఖం, ఒత్తిడి, భావోద్వేగం లేదా అమితమైన ఆనందం వచ్చినప్పుడు కూడా కళ్లలోంచి నీళ్లు తిరుగుతుంటాయి. అయితే సమాజంలో ఇప్పటికీ ఏడవడాన్ని బలహీనతగా, పిరికితనానికి చిహ్నంగా చూసే ధోరణి ఉంది. దీనివల్ల చాలామంది తీవ్రమైన బాధను సైతం గుండెల్లోనే అదిమిపెట్టుకుని కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటారు. అయితే సైకాలజిస్టులు, వైద్య నిపుణుల ప్రకారం ఏడవడాన్ని ఆపుకోవడం శరీరానికి, మనసుకు తీవ్ర హానికరం. కన్నీళ్లు కార్చడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి.

ఒత్తిడిని కడిగేసే సహజ డిటాక్సీఫై

మనం తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు, విష రసాయనాలు అధికంగా విడుదలవుతాయి. ఏడ్చినప్పుడు కారే భావోద్వేగ కన్నీళ్ల ద్వారా ఈ ఒత్తిడి హార్మోన్లు బయటకు వెళ్లిపోతాయి. అందుకే మనసారా ఏడ్చిన తర్వాత శరీరంలో భారం దిగిపోయి, తేలికపడిన భావన కలుగుతుంది.

మానసిక స్థితిని చక్కదిద్దే హార్మోన్లు

ఏడుస్తున్న సమయంలో మెదడు ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ల వంటి ఫీల్ గుడ్ న్యూరోకెమికల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీరానికి, మెదడుకు విశ్రాంతినిస్తాయి. ఫలితంగా అధిక కోపం, ఆందోళన, చిరాకు తగ్గిపోయి క్షణాల్లో మానసిక స్థితి కుదుటపడుతుంది.

సహజ పెయిన్ కిల్లర్.. నొప్పి నుంచి ఉపశమనం

ఏడ్చినప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు సహజమైన పెయిన్ కిల్లర్స్‌లా పనిచేస్తాయి. ఇవి మానసికంగా కలిగిన బాధను తగ్గించడమే కాకుండా శారీరక నొప్పి తీవ్రతను కూడా మొద్దుబారేలా చేస్తాయి. గుండె బరువెక్కినట్లు అనిపించే వేదనను తగ్గించడంలో కన్నీళ్లు నేచురల్ మెడిసిన్‌గా ఉపయోగపడతాయి.

గుండెకు రక్షణ.. బీపీ నియంత్రణ

కన్నీళ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. భావోద్వేగాలను లోపలే దాచుకుంటే గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు పెరిగి కార్డియోవాస్కులర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఏడ్చిన తర్వాత పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి రక్తపోటు తగ్గుతుంది, హృదయ స్పందన రేటు సాధారణ స్థితికి చేరుకుని గుండెపై భారం తగ్గుతుంది.

కంటి ఆరోగ్యం భద్రం.. సహజ యాంటీసెప్టిక్

కన్నీళ్లలో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. కన్నీళ్లు కళ్లలోని కార్నియాను పొడిబారకుండా నిరంతరం తేమగా ఉంచుతాయి. కళ్లలో చేరిన దుమ్ము, ధూళి, ప్రమాదకర బ్యాక్టీరియాను క్షణాల్లో శుభ్రం చేసి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కంటి చూపును కాపాడతాయి.

ప్రశాంతమైన నిద్ర.. రోగనిరోధక శక్తి

ఏడ్చిన కొద్దిసేపటికే పిల్లలతో పాటు పెద్దలు కూడా గాఢ నిద్రలోకి జారుకోవడం గమనించవచ్చు. శరీరంలో రిలీజ్ అయ్యే ఎండార్ఫిన్లు నరాలను శాంతింపజేసి నిద్రలేమి సమస్యను నివారిస్తాయి. అంతేకాకుండా, ఒత్తిడి తగ్గడం వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ బలపడి ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది.

సంబంధాల్లో అనుబంధం, సానుభూతి

ఎవరి ముందైనా బాధతో కన్నీరు పెట్టుకోవడం నిజాయితీకి, అంతర్గత నమ్మకానికి నిదర్శనం. ఇది ఎదుటివారిలో సానుభూతిని రేకెత్తిస్తుంది. మనం కష్టంలో ఉన్నామని తెలుసుకుని పక్కనున్నవారు అందించే మానసిక భరోసా, మద్దతు సంబంధాలను మరింత పటిష్టం చేస్తుంది.

బాధ కలిగినప్పుడు కన్నీళ్లను అదిమిపెట్టి రోగాలను కొనితెచ్చుకోవడం కంటే.. మనసారా ఏడ్చి ఆ బాధను బయటకు పంపేయడమే ఉత్తమం. నవ్వడం ఆరోగ్యానికి ఎంత మంచిదో.. ఏడ్చి మనసు తేలిక చేసుకోవడం కూడా అంతే మంచిది.

Follow Us