మనకు అనారోగ్యం వస్తే వైద్యులను ఆశ్రయిస్తాం.. మరి అలాంటి వైద్యులే అనారోగ్యం పాలైతే? ఒక వైద్యుడు ఆరోగ్యంగా ఉంటే వందలాది మంది రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తాడు. ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. అందుకే వైద్యుల ఆరోగ్యం అత్యంత విలువైంది. ప్రజల్ని అనారోగ్యాల నుంచి విముక్తి చేయాల్సిన వైద్యులే తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులతో పాటు ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఆసుపత్రి ప్రాంగణంలో జిమ్ అనే కొత్త సాంప్రదాయానికి తెరలేపారు.
నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం దేశంలో వైద్యులు, జనాభా నిష్పత్తి 1:854 కావడంతో తీవ్ర పని ఒత్తిడి తప్పడం లేదు. దీంతో పాటే అనేక రకాల ఇతర ఇతర పరిస్థితులు సైతం వైద్యులను రోగులుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది అనారోగ్యాల అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే వైద్యరంగంలో రకరకాల మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న హాస్పిటల్ జిమ్స్, ఇప్పుడిప్పుడే భాగ్యనగరంలోను అందుబాటులోకి వస్తున్నాయి.
ఆస్పత్రి ఆవరణలో జిమ్ ఉండటం అనేక రకాలుగా ప్రయోజనకరం. ముఖ్యంగా క్లిష్టమైన కేసులను డీల్ చేయడం, ఆపరేషన్ కంప్లీట్ చేసిన తర్వాత కలిగే ఒత్తిడి నుండి రిలాక్స్ అవ్వడానికి ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదల కావడానికి మ్యూజిక్‌తో కూడిన వర్కౌట్స్ మంచి ఫలితాన్ని ఇస్తాయని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా ఎక్కువ సమయం హాస్పిటల్‌లో గడపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు జీమ్ అందుబాటులో ఉండటం వల్ల కొంత ఉపయోగకరంగా పలువురు వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.