
చాలామంది ఇళ్లలో మార్కెట్ నుండి చికెన్ తీసుకురాగానే, దానిని రెండు మూడు సార్లు నీళ్లతో శుభ్రంగా కడగడం ఒక అలవాటు. ఇలా చేయడం వల్ల మాంసంపై ఉన్న బ్యాక్టీరియా నశిస్తుందని, చికెన్ శుభ్రపడుతుందని భావిస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు చెబుతున్న నిజం దీనికి భిన్నంగా ఉంది. వండే ముందు చికెన్‌ను కడగడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని, ఇది ప్రాణాంతక బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
పచ్చి చికెన్‌లో క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. మీరు చికెన్‌ను పారే నీటి కింద పెట్టి కడిగినప్పుడు, ఆ నీటి తుంపర్లు మీ వంటగదిలోని సింక్, పాత్రలు, కౌంటర్ టాప్‌లు మరియు పక్కనే ఉన్న ఇతర ఆహార పదార్థాలపై పడతాయి. ఈ ప్రక్రియ వల్ల బ్యాక్టీరియా చనిపోకపోగా, వంటగది అంతా వ్యాపిస్తుంది.
CDC నివేదికల ప్రకారం, పచ్చి కోడి మాంసాన్ని కడగడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
చికెన్‌లోని బ్యాక్టీరియా నశించాలంటే దానికి నీరు కాదు, అధిక ఉష్ణోగ్రత అవసరం.
సరైన ఉష్ణోగ్రత: చికెన్‌ను కనీసం 75°C ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా ఉడికించాలి. ఈ వేడికి మాంసంలోని బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది.
నిల్వ జాగ్రత్తలు: పచ్చి చికెన్‌ను ఫ్రిజ్‌లో ఇతర ఆహార పదార్థాలకు తగలకుండా, విడిగా మూత ఉన్న పాత్రలో భద్రపరచాలి.
మీరు తప్పనిసరిగా చికెన్ కడగాలి అనుకుంటే, ఈ కింది పద్ధతులు పాటించండి..
శుభ్రత: చికెన్ కడిగిన వెంటనే సింక్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలను వేడి నీరు, సబ్బుతో క్షుణ్ణంగా శుభ్రం చేయండి.
చేతుల శుభ్రత: చికెన్‌ను తాకిన తర్వాత కనీసం 20 సెకన్ల పాటు మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
క్రాస్ కంటామినేషన్: చికెన్ కోసం వాడే చాకులను, కటింగ్ బోర్డులను ఇతర కూరగాయలకు వాడకండి.
ఆరోగ్యం కోసం చికెన్ తింటున్నప్పుడు, అది అనారోగ్యానికి కారణం కాకుండా చూసుకోవడం మన బాధ్యత. వండే ముందు కడగడం కంటే, సరిగ్గా ఉడికించడమే అసలైన శుభ్రత అని గుర్తించండి.