ఎండాకాలం పవర్‌ఫుల్.. కానీ, షుగర్ ఉన్న వారు పుచ్చకాయ తినొచ్చా.. లేదా..?
ఎండాకాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా.. పుచ్చకాయ తినడం చాలా మంచిది.. దీనిలో నీటిశాతం అధికంగా ఉంటుంది. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ తీపి పండును తినడానికి చాలా భయపడతారు.. ఎందుకంటే షుగర్ లెవల్స్ పెరుగుతాయని ఆందోళన చెందుతారు. అయితే.. అసలు, మధుమేహం ఉన్నవారు పుచ్చకాయ తినవచ్చా.. లేదా..? అనే విషయాలను తెలుసుకుందాం..

ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు నీటిశాతం అధికంగా ఉండే పండ్లను తినేందుకు ఇష్టపడతారు.. అలాంటి పండ్లలో పుచ్చకాయ ఒకటి.. పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉండటంతోపాటు.. సహజ చక్కెర కూడా అధికంగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) 72.. ఇది అధిక వర్గంలోకి వస్తుంది. సాధారణంగా, మధుమేహం ఉన్నవారు తక్కువ GI (గ్లైసెమిక్ ఇండెక్స్) ఉన్న ఆహారాలను తినాలి. కానీ పుచ్చకాయలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. దీని కారణంగా, దీని గ్లైసెమిక్ లోడ్ (GL) కేవలం 5 మాత్రమే. అంటే, దీనిని తక్కువ పరిమాణంలో తీసుకుంటే, రక్తంలో చక్కెరపై దీని ప్రభావం పెద్దగా ఉండదు..
మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు 100 నుండి 150 గ్రాముల కంటే ఎక్కువ పుచ్చకాయ ముక్కలు తినకపోవడం మంచిది. పుచ్చకాయ రసం తీయడం వల్ల దానిలోని పీచుపదార్థం (ఫైబర్) తగ్గిపోతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగవచ్చు. అందువల్ల.. మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ రసం కంటే ముక్కలు తినడమే మేలు..
పుచ్చకాయ ముక్కలను బాదం, వాల్‌నట్‌లు లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఇతర ఆహారాలతో కలిపి తినడం వల్ల సహజ చక్కెర శోషణ నెమ్మదిస్తుంది. అయితే, పుచ్చకాయ తినే సమయం కూడా చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో కూడా పుచ్చకాయను ఉదయం లేదా మధ్యాహ్నం తినడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాత్రిపూట ఈ పండు తినడం మంచిది కాదని వారు అంటున్నారు.
పుచ్చకాయ ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ పండులో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే, ఇందులో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహం ఉన్నవారు పుచ్చకాయను పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి వారు దీనిని మితంగా తీసుకోవాలి.
(గమనిక: పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలుంటే.. వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది..)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
