తలనొప్పి అనేది చాలా మందిలో సర్వసాధారణంగా కనిపించే సమస్య. అయితే కొంత మందిని ఇది తరచూ వేధిస్తుంటుంది. ఇక చలికాలంలో అయితే ఈ తలనొప్పి సమస్య క్షణక్షణం వెంటాడుతూనే ఉంటుంది. సమస్య పరిష్కారం కోసం పెయిన్ కిల్లర్స్, టాబ్లెట్లను ఆశ్రయించక తప్పదు. అయితే ప్రతిసారి టాబ్లెట్లను వాడడం మన ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. పదేపదే టాబ్లెట్లను వాడితే ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి మందగించడం, తరచుగా చికాకు, అవిశ్రాంతమైన భావాలు మొదలైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటి సమయాల్లోనే మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేస్తే లేదా ఆహారంలో ఉపయోగించే కొన్ని పదార్థాలను వాడడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
లవంగాలు: తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందేందుకు లవంగం ఒక నేచురల్ హోం రెమెడీ. కొన్ని లవంగాలను చూర్ణం చేసి శుభ్రమైన వస్త్రంలో ఉంచండి. మీకు తలనొప్పి వచ్చినప్పుడల్లా.. నొప్పి నుంచి కొంత ఉపశమనం పొందే వరకు లవంగాల చూర్ణం వాసనను పీలుస్తూ ఉండండి. అలాగే గోరువెచ్చని పాలలో లవంగాలు, కొంచెం ఉప్పు వేసుకొని తాగినా తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
దాల్చిన చెక్క: దాల్చిన చెక్క పోపుల పెట్టెలో కనిపించే ఒక సాధారణమైన సుగంధ దినుసు. ఇది ఆహారానికి మంచి రుచిని, సువాసనను ఇవ్వగలదు. తలనొప్పి నివారణకు కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. దాల్చినచెక్కను తురిమి, నీటిని కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను నుదిటిపై రోజుకు 3, 4 సార్లు రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. దాల్చినచెక్క టీలో కలుపుకొని తాగినా కూడా ప్రయోజనం ఉంటుంది.
తులసి: భారతీయులు తులసిని పవిత్రంగా భావించడమే కాక పూజిస్తారు కూడా. అదే సమయంలో తులసిలోని ఔషధ గుణాల కారణంగా, దీనిని అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. తులసి నూనె అనాల్జేసిక్ లేదా పెయిన్ కిల్లర్‌గా సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. తులసి ఆకులు కండరాలను సడలించడమే కాక ఒత్తిడిని తగ్గించి తలనొప్పిని నివారిస్తుంది. తలనొప్పిని వదిలించుకోవడానికి తులసి టీ కూడా అద్భుతమైనది.
పసుపు: తలనొప్పి నివారణకు పసుపు మరొక ప్రధాన హోం రెమెడీ. తాజా పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మైగ్రేన్ దాడుల ఫ్రీక్వెన్సీని, తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు పాలలో కొద్దిగా పసుపు వేసి కాసేపు మరిగించాలి. ఆపై వడకట్టి గోరువెచ్చగా తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..