Bendakaya Fry: జిగురు లేని, కరకరలాడే బెండకాయ ఫ్రై రహస్యం ఇదే! హోటల్ రుచి మీ ఇంట్లోనే..

బెండకాయ ఫ్రై చాలా మందికి ఇష్టమైన కూర. ప్రత్యేకించి క్యాటరింగ్ స్టైల్ లో చేసే బెండకాయ వేపుడుకు అభిమానులు ఎక్కువ. ఇంట్లో అదే విధంగా చేసినా క్రిస్పీగా, రుచిగా రావడం లేదని చాలామంది భావిస్తారు. అలాంటి వారు ఈ పద్ధతిలో ఒకసారి బెండకాయ ఫ్రై చేసి చూడండి. ఈ టిప్స్ తో బెండకాయ ఫ్రై చేస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు..

Bendakaya Fry: జిగురు లేని, కరకరలాడే బెండకాయ ఫ్రై రహస్యం ఇదే! హోటల్ రుచి మీ ఇంట్లోనే..
Bendakaya Fry Recipe

Updated on: May 17, 2025 | 2:24 PM

అద్భుతమైన రుచితో, కరకరలాడుతూ చేసే బెండకాయ ఫ్రై ని ఇష్టపడని వారంటూ ఉండరు. ఈ వంటకం పప్పుచారు, సాంబార్, పెరుగులోకి నంచుకోవడానికి చక్కని సైడ్ డిష్. పిల్లలు ఈ స్టైల్ బెండకాయ ఫ్రై తింటే మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు. మరి, కరకరలాడుతూ ఎంతో రుచికరంగా ఉండే ఈ బెండకాయ ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు ఏమిటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తయారీకి కావలసిన పదార్థాలు:

బెండకాయలు – అర కేజీ

నూనె – డీప్ ఫ్రైకి తగినంత

పల్లీలు – ఒక గుప్పెడు

పచ్చిశనగపప్పు – ఒక టేబుల్ స్పూన్

పొట్టు మినపప్పు – ఒక టేబుల్ స్పూన్

ఆవాలు – అర టీస్పూన్

ఎండుమిర్చి – రెండు లేదా మూడు

జీలకర్ర – పావు టీస్పూన్

పచ్చిమిర్చి – ఐదారు (మీ కారానికి తగినన్ని)

ఇంగువ – పావు టీస్పూన్

కరివేపాకు – కొద్దిగా

కారం – పావు టీస్పూన్

పసుపు – పావు టీస్పూన్

ధనియాల పొడి – ఒక టీస్పూన్

వేయించిన జీలకర్ర పొడి – పావు టీస్పూన్

తయారీ విధానం:

ఈ కరకరలాడే, రుచికరమైన బెండకాయ ఫ్రై కోసం ముందుగా లేత బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిపై నీటి తడి లేకుండా ఒక శుభ్రమైన గుడ్డతో తుడవాలి. తడి లేకుండా తుడిచిన బెండకాయలను ముందుగా రెండు చివర్లు కట్ చేసి మధ్యస్థ పరిమాణంలో చిన్న ముక్కలుగా తరగాలి.

తరిగిన బెండకాయ ముక్కలను ఒక వెడల్పాటి ప్లేట్ లోకి తీసుకొని రెండు మూడు గంటల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల వేయించేటప్పుడు ఎక్కువ సమయం పట్టదు మరియు ముక్కలు వేగిన తర్వాత కరకరలాడుతూ ఉంటాయి.

తర్వాత స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి అధిక మంట మీద వేయించుకోవాలి. వేయించేటప్పుడు బెండకాయలను గరిటెతో ఎక్కువగా కలపకుండా పైపైన కదుపుతూ ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు వేయించాలి.

బెండకాయ ముక్కలు క్రిస్పీగా వేగిన తర్వాత నూనె లేకుండా జాలి గరిటెలోకి తీసుకొని కాసేపు ఉంచి తర్వాత వేరొక గిన్నెలోకి వేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో తాలింపు కోసం బెండకాయలు వేయించిన తర్వాత మిగిలిన నూనెలో తగినంత నూనె ఉంచి వేడి చేయాలి. మిగిలిన నూనెను ఒక గిన్నెలోకి తీసుకొని దాచుకోవాలి.

నూనె వేడయ్యాక అందులో పల్లీలు వేసి వేయించాలి. అవి సగం వేగాక శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని వాటిలో పచ్చిదనం పోయి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి.

తర్వాత అందులో మీ రుచికి తగినట్లుగా పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి ఒకసారి బాగా కలపాలి. ఆపై రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుతూ తాలింపును బాగా వేయించుకోవాలి.

తాలింపు చక్కగా వేగిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి ఆ మిశ్రమం ముక్కలకు పట్టేలా మధ్యస్థ మంట మీద రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.

బెండకాయ ముక్కలకు ఆ మిశ్రమం బాగా పట్టి, అవి చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైన, కరకరలాడే హోటల్ స్టైల్ బెండకాయ వేపుడు సిద్ధం!