
మన తాతల కాలంలో పిండివంటలు చేసినా, జొన్నరొట్టెలు చేసినా అందులో గుప్పెడు నువ్వులు పడాల్సిందే. అంతలా వారి జీవన శైలిలో వీటిని భాగం చేసుకునేవారు. కానీ ఇప్పటికాలం వంటల్లో నువ్వుల నూనే కాదు కనీసం నువ్వులతో చేసే వంటలు కూడా కనుమరుగయ్యాయి. అందుకే చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు, టీనేజీ అమ్మాయిలలో హార్మోన్ల అసమతుల్యత వంటివి పెరిగిపోతున్నాయి. ఇక మగవారిలోనూ కాల్షియం లోపంతో ఎముకలు పెలుసుబారడం కనిపిస్తోంది. ఇవే కాదు నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇంతకీ నువ్వులు చేసే మ్యాజిక్ ఏంటో తెలుసుకుందామా..
ఊబకాయం నుంచి గుండె జబ్బుల వరకు కారణమవుతున్న అధిక కొలెస్ట్రాల్ సమస్యకు నువ్వులు దివ్యౌషధం. మన శరీరానికి కావలసిన మంచి కొవ్వులు ఇందులో అధికంగా ఉంటాయి. రోజూ 40 గ్రాముల నువ్వులు రెండు నెలల పాటు తీసుకున్న వారిలో ఆశ్చర్యకరంగా దాదాపు 10 శాతం కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గినట్టుగా ఓ అధ్యయనంలో తేలింది.
బ్లడ్ ప్రెజర్ అనేది ఈ రోజుల్లో ఎంతో మందిని వేధిస్తున్న సమస్య. అయితే, నువ్వుల్లో ఉండే అధిక మెగ్నీషియం నిల్వలు బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచుతాయి. ధమనుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఖాళీ చేయిస్తాయి. హైబ్లడ్ ప్రెజర్ ఉన్న వారికి రోజూ రెండు గ్రాముల నల్ల నువ్వుల పొడి ఇవ్వడం వల్ల 6 శాతం బ్లడ్ ప్రెజర్ తగ్గుదలను గుర్తించారు.
ఎముకలు బలంగా మారాలంటే మార్కెట్లో దొరికే ఎన్నో పౌడర్లను, మందులను కొని తెచ్చుకుని వాడుతుంటారు. నిజానికి నువ్వులతో ఈ సమస్యను తగ్గించడం చాలా తేలిక. ఇందులో కాల్షియం సహా మాంగనీస్, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. నువ్వులను రోజూ నానబెట్టుకుని లేదా వేయించుకునో, మొలకలతోనో తినడం వల్ల మనకు అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. అంతే కాదు ఎముకలు ఉక్కులా మారాతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
నువ్వుల్లో ఉండే సెలీనియం థైరాయిడ్ తో బాధపడుతున్న వారికి పరమఔషధంలా పనిచేస్తాయి. ఇందుకు కారణమయ్యే వాటిని అరికట్టి మంచి హార్మోన్ లను ఉత్పత్తి చేయడంలో సాయపడతాయి. ఇందులో ఉండే ఐరన్, జింక్, విటమిన్ బీ6 వంటివి థైరాయిడ్ ను దరిచేరనివ్వవు.
నెలసరి సమస్యలతో బాధపడే మహిళలకు నువ్వులు తినిపిస్తే సరిపోతుంది. అంతే కాదు వారిలో అస్తవ్యస్తమైన హార్మోన్లను తిరిగి గాఢిలో పెట్టడంలో నువ్వుల తర్వాతే మరే ఆహారమైనా. వీటికి అంత శక్తి ఉంది. ఇక మెనోపాజ్ దశకు చేరుకున్న వారికి సైతం ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గిపోయి ఎదురయ్యే సమస్యలను ఇవి అరికడతాయి.
కీళ్ల మధ్య ఉండే గుజ్జులాంటి భాగం కరిగిపోయి భరించలేనంత నొప్పికి కారణమవుతుంది. ఇదే కాక ఆర్థరైటిస్ కారణంగా వచ్చే జాయింట్ పెయిన్, నడవలేకపోవడం వంటివాటికి నువ్వులు తినడం ద్వారా చెక్ పెట్టవచ్చు. రోజూ 40 గ్రాముల నువ్వులు తీసుకుంటే 2 నెలల్లోనే ఈ సమస్య 65 శాతం తగ్గినట్టుగా కొంతమందిపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది.