చాలామంది వ్యక్తులకు రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని విసిరేయడం ఇష్టముండదు. అందుకే ఆ ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచుకుని మరుసటి రోజు వేడి చేసుకుని తింటుంటారు. ఇది ప్రతీ ఇంట్లోనూ జరిగే డైలీ రొటీన్. అయితే అసలు మనం మిగిలిపోయిన ఆహారాన్ని తినొచ్చా.! అసలు ఎంతసేపు ఉంచిన ఆహారాన్ని మనం తినొచ్చు. మిగిలిపోయిన ఆహారం తింటే మన ఆరోగ్యానికి మేలు జరుగుతుందా.? అసలు వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.!
ఆయుర్వేదం ప్రకారం, 24 గంటల కంటే ఎక్కువసేపు ఉంచిన ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు. ఒకవేళ తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఆహారాన్ని వండిన తర్వాత అందులో తేమ ఉంటుంది. ఇక దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్‌లో పెడితే.. బ్యాక్టీరియా, ఇతర రోగకారక క్రిములు ప్రబలే అవకాశం ఉంటుంది. తద్వారా అనేక వ్యాధులు దరికి చేరతాయి. మిగిలిపోయిన ఆహారం ఖచ్చితంగా మీ ఆరోగ్యానికి హానికరం.
మరోవైపు కొంతమంది మిగిలిన ఆహారాన్ని మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసి తింటుంటారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఆహారాన్ని మరోసారి వేడి చేయడం ద్వారా అందులోని విటమిన్లు, అవసరమైన పోషకాలు నాశనం అవుతాయి. ఇలా చేయడం వల్ల పలుసార్లు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.