AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chettinad Prawn Fry: సాయంత్రం స్నాక్స్‌లోకి ఘాటైన ‘చెట్టినాడ్ రొయ్యల ఫ్రై’.. నోట్లో వేస్తే కరిగిపోయే సీక్రెట్ మసాలా రెసిపీ

సీఫుడ్ ప్రియులకు రొయ్యలు అంటే ఉండే క్రేజే వేరు. రొయ్యలతో బిర్యానీ, ఇగురు, పచ్చడి ఇలా ఏం చేసినా లొట్టలేసుకుంటూ తింటారు. అయితే, బోర్ కొట్టే రెగ్యులర్ వంటకాలకు భిన్నంగా.. సాయంత్రం పూట వేడివేడిగా, ఘాటుగా ఏదైనా నాన్-వెజ్ స్నాక్ తినాలనిపిస్తే దానికి పర్‌ఫెక్ట్ ఛాయిస్ 'చెట్టినాడ్ ప్రాన్ ఫ్రై'. దీన్ని ఎలా చేయాలో చూద్దాం..

Chettinad Prawn Fry: సాయంత్రం స్నాక్స్‌లోకి ఘాటైన 'చెట్టినాడ్ రొయ్యల ఫ్రై'.. నోట్లో వేస్తే కరిగిపోయే సీక్రెట్ మసాలా రెసిపీ
Chettinad Prawn Fry Recipe
Bhavani
|

Updated on: Jul 08, 2026 | 12:24 PM

Share

తమిళనాడులోని ప్రసిద్ధ చెట్టినాడ్ ప్రాంతపు వంటకాలు వాటి ఘాటైన, ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాల మసాలాకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయి. ఈ స్పెషల్ మసాలాతో రొయ్యలను వేపితే వచ్చే సువాసన ఇల్లంతా అల్లేస్తుంది. మరి ముక్క ముక్కకూ మసాలా పట్టి, రొయ్యలు రబ్బరులా కాకుండా సాఫ్ట్‌గా, జ్యుసీగా వచ్చేలా ఈ చెట్టినాడ్ రొయ్యల వేపుడును ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

క్లీన్ చేసిన రొయ్యలు – అర కిలో

ఉల్లిపాయలు – 2 (సన్నని ముక్కలు)

టమోటా – 1 (సన్నని ముక్కలు)

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 చెంచా

పసుపు – అర చెంచా, నిమ్మరసం – 1 చెంచా

కరివేపాకు – రెండు రెమ్మలు, నూనె – సరిపడా, ఉప్పు – రుచికి తగినట్లు

చెట్టినాడ్ స్పెషల్ మసాలా పొడి కోసం (దీనే అసలైన రుచి):

ధనియాలు – 1 పెద్ద చెంచా

ఎండుమిర్చి – 4 లేదా 5

మిరియాలు – 1 చెంచా (చెట్టినాడ్ వంటకాల్లో మిరియాల ఘాటు చాలా ముఖ్యం)

సోంపు – 1 చెంచా, జీలకర్ర – అర చెంచా

లవంగాలు – 3, దాల్చిన చెక్క – చిన్న ముక్క, యాలకులు – 2 (వీటన్నింటినీ నూనె లేకుండా దోరగా వేయించి, చల్లారాక మిక్సీలో మెత్తటి పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి).

తయారీ విధానం

స్టెప్ 1 (మారినేషన్): ముందుగా క్లీన్ చేసిన రొయ్యల్లో కొద్దిగా పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక 15 నుండి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. నిమ్మరసం వేయడం వల్ల రొయ్యల నీచు వాసన పోవడమే కాకుండా ముక్క సాఫ్ట్‌గా మారుతుంది.

స్టెప్ 2: ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి 3 చెంచాల నూనె వేయాలి. నూనె వేడెక్కాక కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేపాలి.

స్టెప్ 3: ఇందులో టమోటా ముక్కలు వేసి అవి మెత్తగా గుజ్జులా అయ్యే వరకు మగ్గించాలి. టమోటా బాగా మగ్గాక, ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసి కలపాలి.

స్టెప్ 4 (ముఖ్యమైన ట్రిక్): రొయ్యలు వేసిన వెంబడే నీళ్లు పోయకూడదు. రొయ్యల నుండి సహజంగానే నీరు బయటకు వస్తుంది. ఆ నీటితోనే హై ఫ్లేమ్‌లో 3 నుండి 4 నిమిషాలు ఉడికించాలి. రొయ్యలను ఎక్కువసేపు ఉడికిస్తే అవి రబ్బరులా గట్టిగా అయిపోతాయి, కాబట్టి కేవలం 7-8 నిమిషాల మొత్తం కుకింగ్ టైమ్ సరిపోతుంది.

స్టెప్ 5: రొయ్యల్లోని నీరంతా ఎగిరిపోతున్న సమయంలో.. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ‘చెట్టినాడ్ స్పెషల్ మసాలా పొడి’ని వేసి రొయ్యలకు బాగా పట్టించాలి. మంటను సిమ్‌లో పెట్టి మసాలా అంతా ముక్కలకు అంటుకుని డ్రైగా అయ్యే వరకు మరో 2 నిమిషాలు వేయించి, చివరగా కొత్తిమీర చల్లుకుని దించేయాలి.

అంతే.. నోరూరుంచే వేడివేడి, స్పైసీ చెట్టినాడ్ రొయ్యల ఫ్రై రెడీ. దీనిని సాయంత్రం పూట స్నాక్‌గా తినవచ్చు లేదా పప్పు చారు, రసంలోకి నంజుడుగా తింటే అద్భుతంగా ఉంటుంది.

Follow Us