బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఇది తిని చూడండి.. గ్యారెంటీగా బరువు తగ్గుతారు
ప్రస్తుత రోజుల్లో అధిక బరువు సమస్యగా మారింది. తక్కువ సమయంలో బరువు పెరగడం సులభం అయితే.. అదే బరువును తగ్గించుకోవడం చాలా మందికి పెద్ద కష్టంగా అనిపిస్తుంది. నిత్యం పనుల ఒత్తిడి, నిశ్చలమైన జీవనశైలి కారణంగా బరువు పెరగడం సాధారణమే. అయితే చాలా మంది వెయిట్ లాస్ కోసం డైట్‌లు, వ్యాయామాలు, మందులు ఇలా ఎన్నో మార్గాల్లో ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఆశించిన ఫలితం రావడం లేదు.

కొంతమంది బరువు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఖరీదైన ఔషధాలు వాడుతుంటారు. అయితే అవి తాత్కాలికమైన ఫలితాలు మాత్రమే ఇస్తాయి. తిరిగి బరువు పెరగడం కూడా సాధారణమే. దీని బదులు, సహజమైన మార్గాలను ఎంచుకోవడం ఆరోగ్యపరంగా మంచిది. ఇందులో భాగంగా ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా బరువు తగ్గడంలో మంచి ఫలితాలు పొందవచ్చు.
అలాంటి వాటిలో బెస్ట్ ఆప్షన్ పెసరట్టు. ఇది శరీరానికి పోషకాలను అందించడంతోపాటు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. పెసరపప్పుతో తయారయ్యే ఈ పెసరట్టు డైట్‌లో భాగంగా చేర్చుకుంటే చాలు తగ్గేదే లే అన్నట్లు బరువు తగ్గవచ్చు.
పెసరపప్పులో ఉండే ప్రొటీన్లు, ఫైబర్ వల్ల మితమైన ఆకలితో పాటు జీర్ణక్రియ మెరుగవుతుంది. దీని వల్ల పొట్ట త్వరగా ఖాళీ కావడం జరగదు. ఫలితంగా ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. పైగా ఇది గ్లూటెన్ ఫ్రీ ఆహారం కావడంతో బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.
కావాల్సిన పదార్థాలు
- పెసరపప్పు – 1 కప్పు (ఒక రాత్రి నానబెట్టింది)
- పచ్చిమిరపకాయలు – 2 నుండి 3
- అల్లం – చిన్న ముక్క
- ఉప్పు – తగినంత
- నూనె లేదా నెయ్యి – అవసరమైనంత
తయారీ విధానం
ముందుగా నానబెట్టిన పెసరపప్పును తగినంత నీటితో కలిపి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమంలోనే పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి మరోసారి మిక్సీలో వేసి మృదువుగా రుబ్బుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
అనంతరం పెనం మీద కొంచెం నూనె లేదా నెయ్యి వేయాలి. ఆ పిండిని ఒక గరిటెతో తీసుకొని పెసరట్టులాగా పలుచగా వేసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. చివరగా దీన్ని పుదీనా చట్నీతో వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది.
రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా స్నాక్స్‌గా పెసరట్టును తీసుకుంటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది తక్కువ క్యాలరీస్, ఎక్కువ పోషకాలతో ఉండే ఆహారం కావడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుతూ బరువును తగ్గించుకోవచ్చు. ఖరీదైన డైట్స్ లేదా ఔషధాలపై డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈ సులభమైన మార్గంతో వెయిట్ లాస్ సాధించండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




