Pala Undrallu Payasam: తొలిఏకాదశి, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి వంటి పండగల్లో తెలుగు లోగిళ్లలో సందడి నెలకొంది. ముఖ్యంగా ఈ పండుగల సమయంలో నూనె తో చేసిన ఆహారపదార్ధాల కంటే.. నీటితో చేసిన పిండివంటలనే దేవుళ్ళకు నైవేద్యంగా పెట్టె ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా ఉమ్మడి గోదావరిజిల్లాల్లో వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి పండగల్లో ఉండ్రాళ్ళ పాయసం తప్పనిసరిగా చేస్తారు. ప్రసాదంగా నివేదిస్తారు.. ఈరోజు ఈజీగా టేస్టీగా ఉండ్రాళ్ళ పాయసం తయారీ విధానం తెలుసుకుందాం.. ఉండ్రాళ్ళ పాయసాన్ని కొన్ని చోట్ల పాల ఉండ్రాళ్ళు అని కూడా అంటారు
బియ్యం పిండి -ఒక కప్పు
పాలు
బెల్లం -ఒక కప్పు తురుముకుంది
కొబ్బరి ముక్కలు
పచ్చిశనగ పప్పు -నానబెట్టినది కొంచెం
యాలకులు పొడి
జీడిపప్పు
కిస్మిస్
బాదం
నీళ్లు
ఉప్పు చిటికెడు
నెయ్యి
ముందుగా శనగపప్పుని ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇంతలో పాలు కాచి చల్లార్చుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకుని నేయి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్, బాదంపప్పుని వేయించుకోవాలి.. తర్వాత అవి ఒక పక్కకు తీసుకుని బాండీలో బియ్యం పిండి కొంచెం ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం పంచదార వేసుకుని.. ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పుల నీరు పోసుకుని ముద్దలు లేకుండా కలుపుకోవాలి.. తర్వాత స్టౌ మీద పెట్టి.. బియ్యం పిండిని ఉడికించుకోవాలి.. బాణలికి అంటుకోకుండా బియ్యం పిండి ఉడికిన తర్వాత దానిని వేరే ప్లేట్ లోకి తీసుకుని చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసుకోవాలి. కొంచెం ఉండ్రాళ్ళ పిండిని పక్కకు తీసుకుని అందుకో నీరు పోసుకుని వాటర్ లా కలుపుకోవాలి.
తర్వాత వేరే దళసరి గిన్నె స్టౌ మీద పెట్టుకుని బెల్లం పొడిని వేసుకుని మూడు కప్పుల నీరు పోయాలి.. అందులో శనగపప్పు వేసుకుని బెల్లం కరిగేవరకూ మరగనిచ్చి తర్వాత తయారు చేసుకున్న ఉండ్రాళ్ళను బెల్లంనీటిలో వేసుకోవాలి. తర్వాత ఉండ్రాళ్ళు ఆ బెల్లంపాకంలో ఉడకనివ్వాలి.. శనగపప్పు ఉడికిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకుని కొంచెం సేపు ఉడికించిన తర్వాత నీటిలో కలుపుకున్న ఉండ్రాళ్ళ పిండిని వేసి.. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.. కొంచెం సేపు ఉడికిన తర్వాత యాలకుల పొడి, నేతిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ , బాదాం లను వేసుకుని .. దింపేసుకోవాలి.. తర్వాత చల్లారిన పాలను పోసుకుంటే.. రుచికరమైన పాల ఉండ్రాళ్ళు రెడీ.