Navratri 3rd Day Naivedyam:హిందువుల ముఖ్యమైన పండుగల్లో ఒకటి దసరా.. చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా విజయదశమి పండగను జరుపుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఈ తొమ్మిది రోజులు శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇస్తారు. అమ్మవారిని తొమ్మిది రోజులు రకరకాలుగా అలంకరించి.. అమ్మవారికి ఇష్టమైన పదార్ధాలతో నైవేద్యం పెడతారు. ఇక నవరాత్రుల్లో మూడో రోజు కొన్ని ప్రాంతాల్లో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు. ఈరోజు కొబ్బరన్నం తయారీకి గురించి తెలుసుకుందాం..
కొబ్బరన్నం తయారీకి కావలసిన పదార్ధాలు:
బియ్యం- అర కిలో
తురిమిన పచ్చికొబ్బరి -ఒక కప్పు
జీడి పప్పు 10
పచ్చిమిర్చి- 5
పోపు దినుసులు
ఎండుమిర్చి
శనగపప్పు
మినపప్పు
ఆవాలు
ఇంగువ
కరివేపాకు రెండు రెబ్బలు
కొత్తిమీర
ఉప్పు రుచికిసరిపడా
నూనె కొంచెం
నెయ్యి -ఒక టేబుల్ స్పూన్
తయారు విధానం: ముందుగా అన్నం పొడి పొడిగా ఉండేలా వండుకోవాలి. తర్వాత ఒక బాణలి తీసుకుని అందులో నెయ్యి వేసి.. వేడి ఎక్కిన తర్వాత పచ్చి కొబ్బరి తురుముని వేయించి దానిని వేడి వేడి అన్నంలో కలపాలి. తర్వాత అదే బాణలిలో ముందుగా జీడిపప్పు వేసుకుని వేయించి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అందులో ఎండుమిర్చి, పచ్చి మిర్చి, పోపుదినుసులు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, వేసుకుని వేగిన తర్వాత ఇంగువ, కర్వేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. ఇలా వేగిన పోపులో కొబ్బరి కలుపుకున్న అన్నం వేసుకుని కొంచెం నెయ్యి వేసి వేగనిచ్చి స్టౌ మీద నుంచి దించేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, కొత్తిమీర చల్లుకుంటే చాలు రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ.. అన్నపూర్ణాదేవి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం నైవేద్యంగా పెట్టి.. అమ్మవారి కృపకు పాత్రులు కండి
Also Read: ప్రకాష్ రాజ్‌కి క్రమశిక్షణ లేదంటూ విష్ణుకి మద్దతు ప్రకటించిన కోటా శ్రీనివాసరావు..