AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాడీ ఉక్కులా మారిపోయిద్ది.. వారానికి ఒక్కసారి తింటే ఆ సమస్యలే ఉండవు..

మటన్ పాయా సూప్‌ రుచితో పాటు పోషక విలువలు కలిగిన సంప్రదాయ వంటకం. మేక కాళ్లతో తయారు చేసే ఈ సూప్‌లో ప్రొటీన్, కాల్షియం, కొల్లాజెన్, జెలటిన్ వంటి పోషకాలు ఉంటాయి. తక్కువ మసాలాలతో హైదరాబాదీ స్టైల్‌లో మటన్ పాయా సూప్‌ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో, దాని పోషక విలువలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..

బాడీ ఉక్కులా మారిపోయిద్ది.. వారానికి ఒక్కసారి తింటే ఆ సమస్యలే ఉండవు..
Mutton Paya Soup
Shaik Madar Saheb
|

Updated on: Aug 19, 2026 | 1:13 PM

Share

చికెన్, మటన్‌ను నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తింటారు. కర్రీ, ఫ్రై తోపాటు పలు విధాలుగా వండుకుని ఎంజాయ్ చేస్తారు. చికెన్ తో పోలిస్తే.. మటన్ లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అయితే, మటన్ తోపాటు.. మేకలోని లివర్, తలకాయ, కాళ్లు, తిల్లి, బోటి అన్ని కూడా శక్తివంతమైన ఆహారాలే.. ముఖ్యంగా మేక (మటన్ పాయ) కాళ్లసూప్ ఎంతో మంచిది. మటన్ పాయా సూప్, ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాదీ వంటకాల్లో ఒక ప్రసిద్ధ వంటకంగా పేర్కొంటారు. మటన్ పాయ (మేక కాళ్ళ సూప్) ఎముకల బలానికి, కీళ్ల నొప్పుల నివారణకు, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో క్యాల్షియం, కొల్లాజెన్, ప్రోటీన్లు, జెలటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడంతోపాటు.. శరీరానికి తక్షణ శక్తి ఇస్తాయి.. ఇంకా దీనిలోని కొల్లాజెన్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అనారోగ్యం నుండి కోలుకుంటున్న వారికి ఇది మంచి పోషకాహారమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఒక్కసారి తాగితే.. ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటున్నారు.

ఆరోగ్యకరమైన హైదరాబాదీ మటన్ పాయా సూప్ తయారీ విధానం

మటన్ పాయా సూప్, సులభంగా తయారుచేయగలిగే, పోషక విలువలు గల వంటకం. తక్కువ మసాలాలతో, మైల్డ్ ఫ్లేవర్‌తో కూడి, పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే విధంగా ఎలా తయారు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఈ పాయా, కడుపుకు తేలికగా ఉంటూ, సులువుగా జీర్ణమయ్యే గుణాన్ని కలిగి ఉంటుంది.

ఈ వంటకానికి కావలసిన పదార్థాలు: నూనె, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, మిరియాలు, జీలకర్ర, అల్లం-వెల్లుల్లి, ఉల్లిపాయలు, ధనియాలు, బిర్యానీ ఆకు, శుభ్రం చేసిన మేక కాళ్ళు, ఉప్పు, పసుపు, నీరు, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్, బాదాం పేస్ట్ (లేదా జొన్న పిండి).

ముందుగా, మేక కాళ్ళను ఉప్పు, పసుపుతో బాగా రుద్ది శుభ్రం చేయాలి. ఇది వాసనను తొలగించి, రుచిని పెంచుతుంది. కుక్కర్‌లో నూనె వేడి చేసి, మసాలా దినుసులు, అల్లం-వెల్లుల్లి, ఉల్లిపాయలు వేయించాలి. తరువాత మేక కాళ్ళను వేసి, అవి గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి. ఇది రుచిని మెరుగుపరుస్తుంది. ఉప్పు, పసుపు, పుదీనా, నీరు చేర్చి, సిమ్ లో 8 నుండి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చివరిగా, పచ్చిమిర్చి, బాదాం పేస్ట్ (లేదా జొన్న పిండి నీరు) కలిపి, కొన్ని నిమిషాలు ఉడికించి సర్వ్ చేయాలి. ఈ పాయా సూప్‌ను అన్నంతోపాటు.. నాన్‌తో, జొన్న రొట్టెతో లేదా విడిగా సూప్‌గా ఆస్వాదించవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us