ధోనీ ఫేవరెట్ బట్టర్ చికెన్ మసాలా..! రెస్టారెంట్ స్టైల్ రెసిపీ..!
క్రికెట్ లెజెండ్ ఎమ్.ఎస్ ధోనీ ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తాడు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంలో చాలా కచ్చితంగా ఉంటారు. ఉదయాన్నే ఆరోగ్యకరమైన నట్స్, పండ్లు కలిపిన పొర్రిడ్జ్ తింటారు. మధ్యాహ్న భోజనంగా చపాతీలు, పప్పు లేదా చికెన్ తింటారు. సాయంత్రం చికెన్ శాండ్‌విచ్ తినడం లేదా తాజా ఫ్రూట్ జ్యూస్ తాగడం ఇష్టపడతారు. ఇవే కాకుండా పాల పదార్థాలు అంటే చాలా ఇష్టం.. ముఖ్యంగా పాలు, పెరుగు ఎక్కువగా తీసుకుంటారు.

ఇంకా ఇష్టమైన మరో రెసిపీ కూడా ఉంది. అదే బట్టర్ చికెన్ మసాలా రెసిపీ.. ఇది ఎమ్.ఎస్ ధోనీకి ఫేవరెట్ ఫుడ్. ఇంట్లోనే ఈ స్పెషల్ డిష్ ని తయారు చేసుకోవచ్చు. రుచికరమైన గ్రేవీ, మృదువైన చికెన్ ముక్కలతో ఈ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ ఇస్తుంది. ఇంట్లోనే ఈ రెసిపీని సులభంగా తయారు చేసి మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదించండి.
మారినేషన్ కోసం కావాల్సిన పదార్థాలు
- చికెన్ – ½ కిలో
- పెరుగు – 4 టేబుల్ స్పూన్లు
- రెడ్ చిలీ పొడి – ¾ టీ స్పూన్
- గరం మసాలా – ½ టీ స్పూన్
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు
- పసుపు – చిటికెడు
- ఉప్పు – 1 టీ స్పూన్
గ్రేవీ కోసం కావాల్సిన పదార్థాలు
- బట్టర్ – 2 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయ – 2 (సన్నగా తరిగినవి)
- టమోటా గుజ్జు – 1 ½ కప్పు
- కాజూ – 6
- బాదం – 5
- గరం మసాలా – ½ టీ స్పూన్
- ధనియాల పొడి – 1 టీ స్పూన్
- బిర్యానీ ఆకు – 1
- ఏలకులు – 3
- లవంగాలు – 3
- దాల్చిన చెక్క – 1 చిన్న ముక్క
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
- కాశ్మీరి మిర్చి – 3 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
- ఫ్రెష్ క్రీమ్ – 3 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర – గార్నిష్‌కి
తయారీ విధానం
ముందుగా చికెన్‌ను పై చెప్పిన అన్ని పదార్థాలతో బాగా కలిపి కనీసం 4-6 గంటలు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. మరింత రుచిగా కావాలంటే ఒక రాత్రంతా మారినేట్ చేయడం మంచిది.
ఇప్పుడు గ్రేవీ సిద్ధం చేసేందుకు పాన్‌లో 1 టేబుల్ స్పూన్ బట్టర్ వేసి ఉల్లిపాయలను ముదురు రంగు వచ్చే వరకు వేయించాలి. అందులో టమోటా గుజ్జు వేసి 5 నిమిషాలు ఉడికించి.. కాజూ, బాదం వేసి మరో 2 నిమిషాలు వేయించాలి. దీనికి ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి ఒక కప్పు నీరు పోసి మగ్గించాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ గ్రేవీ చల్లారిన తర్వాత మిక్సీలో బ్లెండ్ చేయాలి.
మరో పాన్‌లో 1 టేబుల్ స్పూన్ బట్టర్ వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కాశ్మీరి మిర్చి వేసి వేయించాలి. మారినేట్ చేసిన చికెన్‌ను వేసి 5 నిమిషాలు వేయించాలి. చివరగా మిక్సీలో బ్లెండ్ చేసిన గ్రేవీని ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపి చిన్న మంటపై ఉడికించాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి. మీరు ఒక్కసారి ఈ వంటకాన్ని తయారు చేయండి.. మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదించండి.