
మాన్‌సూన్ స్పెషల్ గా స్వీట్ కార్న్ ధోక్లా అదిరిపోతుంది. రొటీన్ స్నాక్స్‌తో బోర్ కొట్టి ఉంటే.. నోట్లో కరిగిపోయే ఈ ధోక్లా ట్రై చేయండి. కార్న్ పేస్ట్, రవ్వ, మసాలాలతో ఆవిరి మీద తయారయ్యే ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కొత్తిమీర చట్నీ, వేడి వేడి చాయ్‌తో తింటే ఆ మజానే వేరు. సులభంగా చేసుకునే ఈ రెసిపీని మీ ఇంట్లో వాళ్లకు చేసి పెట్టి మెప్పు పొందండి.
ముందుగా ఒక గిన్నెలో రవ్వ, పుల్లటి పెరుగు, నీళ్లు, చక్కెర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 20 నిమిషాలు పక్కన ఉంచాలి. ఈలోపు స్వీట్ కార్న్ ను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ మిశ్రమంలో ఈ కార్న్ పేస్ట్, పసుపు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో, నూనె వేసి కలపాలి.
ఒక ప్లేట్ లేదా ట్రేకు నూనె రాసి ఇడ్లీ స్టాండ్ లేదా స్టీమర్‌లో ఒక కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. ధోక్లా పిండిలో బేకింగ్ సోడా వేసి కలిపి నూనె రాసిన ప్లేట్‌లో పోసి హై ఫ్లేమ్‌పై 20 నిమిషాలు ఆవిరిలో ఉడికించాలి. ధోక్లా ఉడికేలోపు ఒక చిన్న పాన్‌లో నూనె వేసి ఆవాలు, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు తయారు చేయాలి.
చివరిగా ఉడికిన ధోక్లాపై ఈ తాలింపు వేసి నచ్చిన ఆకారాల్లో కట్ చేసి వేడివేడిగా కొత్తిమీర చట్నీతో వడ్డించాలి. ఈ ఈజీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ ధోక్లాను మీరు కూడా ట్రై చేసి ఈ మాన్‌సూన్‌ను ఎంజాయ్ చేయండి.