తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప మాలలు ధరించే భక్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. మాలలు ధరించడానికి వీలు కుదరని వారు సైతం కేరళలోని శబరిమల వెళ్లి ఆ హరిహర పుత్రుడ్ని దర్శించుకుని వస్తున్నారు. ఇక అయ్యప్పను దర్శించుకున్న తర్వాత అక్కడ దొరికే ప్రసాదాన్ని తీసుకునివచ్చి బంధుమిత్రులకు పంచుతారన్న విషయం తెలిసిందే. అయ్యప్ప ప్రసాదం టేస్ట్ ఎంతో విభిన్నం.. అమోఘం. తిరుపతి లడ్డూ, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తర్వాత.. శబరిలోని అరవణి ప్రసాదం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. బెల్లం, బియ్యం, నెయ్యి ఉపయోగించి చేసే ఈ ప్రసాదం తయారు చేస్తారు. తినడానికి టేస్టీగా ఉండటం మాత్రమే కాదు. ఈ ప్రసాదం తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని డైటీషియన్లు చెబుతున్నారు. కేరళలో పూజలు, పర్వదినం సమయాల్లో అరవణ పాయసాన్ని తయారు చేస్తారు. అరవణ పాయసం తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం…
ముందుగా నల్ల బెల్లాన్ని మొత్తగా తురిమి దానిని ఒక పాత్రలో వేసుకుని కరిగించాలి. మరో పాత్రలో నెయ్యి వేసుకుని పచ్చి కొబ్బరి, జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఎర్రబియ్యాన్ని అన్నంలా వండుకోవాలి. ఇలా రైస్ ఉడికించే సమయంలోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆపై అన్నం మెత్తగా ఉడికిన తర్వాత.. దీనిలో కరిగించుకున్న నల్ల బెల్లం పాకాన్ని వేయాలి. తర్వాత కొంచెం శొంఠి పొడిని కలిపి.. నెయ్యి వేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడుకుతున్న సమయంలో బబుల్స్ వస్తుంటే.. స్టౌ ఆఫ్ చేసి.. దానిలో వేయించిన కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసుకోవాలి. అంతే.. కేరళ శబరిమల అరవణ పాయసం ప్రసాదం రెడీ అవుతుంది. ఈ ప్రసాదం తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు కూడా అందుతాయి.