
గుడ్డులో ప్రొటీన్లు, రిబోఫ్లేవిన్, ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం, మెగ్నీషియం, విటమిన్ A, E, B6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు, కణజాలాల పెరుగుదలకు కావాల్సిన పోషణను అందిస్తాయి. జుట్టు పెరుగుదల నుండి గుండె ఆరోగ్యం వరకు గుడ్డు అనేక విధాలుగా శరీరానికి మేలు చేస్తుంది.
గుడ్లు – 4
పెద్ద ఉల్లిపాయలు – 2
టమాటా – 1
వెల్లుల్లి – 10 రెబ్బలు
ధనియాల పొడి – 2 1/2 టీస్పూన్లు
పసుపు – 1/4 టీస్పూన్
కారం – 1/2 టీస్పూన్
కొత్తిమీర తరుగు – ఒక కట్ట
నూనె – 4 టీస్పూన్లు
ఉప్పు – తగినంత
ముందుగా, మూడు గుడ్లను ఒక గిన్నెలో వేసి అవి మునిగే వరకు నీళ్లు పోసి, 10 నిమిషాల పాటు ఉడికించాలి. అవి చల్లారాక పొట్టు తీసి, నిలువుగా రెండు భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటా సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి నూనె వేసి వేడెక్కాక వెల్లుల్లి వేసి వేయించాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
అదే పాత్రలో తరిగిన టమాటాలను వేసి మగ్గనివ్వాలి.
టమాటా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత నీళ్లు కలిపి బాగా మరిగించాలి.
పులుసు బాగా మరిగిన తర్వాత మిగిలిన ఒక గుడ్డును పగలగొట్టి మరుగుతున్న పులుసులో వేసి బాగా కలిపి మరిగించాలి.
చివరగా, ముందుగా ఉడికించి కట్ చేసుకున్న గుడ్లను వేసి ఒకసారి మరిగించి, సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి దించేయాలి.