Rava Pongal Recipe: నోట్లో కరిగిపోయే గోధుమ రవ్వ పొంగలి.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
గోధుమల నుంచి తయారు చేసిన గోధుమ రవ్వ ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణింపబడుతున్నది. ఈ గోధుమ రవ్వతో ఉప్మా, కేకులు, బిస్కెట్లు, స్వీట్లు సహా ఇతర అనేక రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. అయితే గోధుమ రవ్వతో పొంగలి కూడా చేరుకోవచ్చు. ఈ రోజు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే గోధుమ రవ్వ పొంగలి తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

గోధుమ రవ్వతో రకరకాల ఆహర పదార్ధాలను తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. గోధుమ రవ్వతో కేసరి, ఉప్మా వంటివి కూడా చేసుకుంటారు. అయితే అతి తక్కువ మంది మాత్రమే గోధుమ రవ్వ పొంగలిని చేసుకుంటారు. మీరు కూడా డిఫరెంట్ గా గోధుమ రవ్వతో పొంగలి చేసుకోవాలని కోరుకుంటుంటే ఇలా ట్రై చేయండి. వేడివేడిగా ఈ రవ్వ పొంగలిని తింటే టేస్ట్ అదిరిపోతుంది. పిల్లలు, పెద్దలందరూ ఎంతో ఇష్టంగా తినే గోధుమ రవ్వ పొంగలి రెసిపీ తయారీ ఇప్పుడు తెలుసుకుందాం..
రవ్వ పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు
- గోధుమ రవ్వ – కప్పు
- పెసరపప్పు – పావు కప్పు
- పచ్చిమిర్చి – 3
- రుచికి సరిపడా – ఉప్పు
- 5 కప్పుల – నీళ్లు
- అర టీస్పూన్ – మిరియాలు
- నెయ్యి- సరిపడా
- జీలకర్ర- అర టీస్పూన్
- కరివేపాకు – 2
- ఇంగువ- చిటికెడు
- పసుపు- కొంచెం
- అల్లం తరుగు- అర టీస్పూన్
- పచ్చికొబ్బరి ముక్కలు- లేదా కొబ్బరికోరు కొంచెం
- జీడిపప్పు – 10
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి, పాన్ పెట్టి, తక్కువ మంట మీద పెసరపప్పు వేసి వేయించండి. తర్వాత ఇదే పాన్ గోధుమ రవ్వ వేసి కమ్మని వాసన వచ్చే వరకూ వేయించండి. ఇప్పుడు వేయించుకున్న పెసర పప్పుని కుక్కర్ లో వేసి శుభ్రంగా కడగండి. కప్పు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు పెసర పప్పుని ఉడికించండి. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి.. 5 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి నీరు మరిగించి.. అందులో కొంచెం నెయ్యి, పసుపు వేసి తర్వాత వేయించుకున్న గోధుమ రవ్వని వేసి ఉండలు లేకుండా కలుపుకోండి. గోధుమ రవ్వ ఉడికిన తర్వాత ఉడికించుకున్న పెసరపప్పు వేసి.. రెండు కలిసేలా బాగా కలుపుకోవాలి.
ఇంతలో మరో స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి మిరియాలు, జీలకర్ర వేసి వేయించి ఆపై జీడిపప్పు వేసి దోరగా వేయించండి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ పోపుని ఉడికిన గోధుమ రవ్వ పెసర పప్పు మిశ్రమంలో వేసి బాగా కలపండి. అంతే వేడి వేడిగా గోధుమ రవ్వ పొంగలి రెడీ. ఇది రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.




