నాన్ వెజ్‌లో అందరూ ఎక్కువగా తినే వాటిల్లో చికెన్ కూడా ఒకటి. చికెన్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. చికెన్ ద్వారా మంచి ప్రోటీన్, ఫైబర్, ఇతర పోషకాలు చక్కగా అందుతాయి. చికెన్‌తో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేయాలి అనేకునేవారు ఈ పాలక్ చికెన్ ట్రై చేయండి. రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్‌లో కంటే చపాతీ, నాన్స్‌లోకి చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ పాలక్ చికెన్ కర్రీని ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పాలకూర, చికెన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆయిల్.
ముందుగా చికెన్‌ని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసి ఓ అరగంట పాటు పక్కన పెట్టాలి. ఈలోపు ఓ కుక్కర్ తీసుకుని అందులో కట్ చేసిన పాలకూర, పచ్చి మిర్చి వేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. వేడి చల్లారాక మెత్తగా రుబ్బి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి అయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక.. ఉల్లిపాయలు, కొన్ని పచ్చి మిర్చి వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి.
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి ఓ నిమిషం ఫ్రై చేశాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసి.. ఓ పది నిమిషాలు ఉడికించాలి. చికెన్‌లోని వాటర్ బయటకు వచ్చాక.. ఉడికించిన పాల కూర వేసి మరో పది నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత సరిపడినంత వాటర్ వేసి.. దగ్గర పడేంత వరకు కుక్ చేయాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి ఓ ఉడుకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పాలక్ చికెన్ కర్రీ సిద్ధం.