సాయంత్రం అవగానే ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తూ ఉంటుంది. మరి ఎప్పుడూ ఒకే రకమైనవి కాకుండా.. కాస్త డిఫరెంట్‌గా తినాలంటే ఈ దాల్ మసాలా వడలు చాలా బావుంటాయి. వీటిని అన్ని పప్పులతో కలిపి తయారు చేస్తారు. ఇది చేయడం కూడా ఈజీ. ఎవరైనా కూడా సులభంగా చేయవచ్చు. ఇవి తినడం వల్ల ఎంతో ఆరోగ్యం కూడా లభిస్తుంది. బయట నుంచి తీసుకొచ్చే వాటికి బదులు ఇంట్లోనే హ్యాపీగా, హెల్దీగా చేసుకోవచ్చు. స్పెషల్ డేస్‌లో, వీకెండ్స్‌లో చేసుకుంటే బావుంటుంది. ఇవి కూడా క్రిస్పీగా, రుచిగా ఉంటాయి. మరి ఈ మసాలా వడలను ఎలా తయారు చేసుకుంటారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
శనగ పప్పు, పెసర పప్పు, మినపప్పు, అల్లం, పచ్చి మిర్చి, బియ్యం పిండి, కొత్తి మీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పుదీనా, ఆయిల్.
శనగ పప్పు, పెసర పప్పు, మినపప్పు శుభ్రంగా కడిగి.. ఓ నాలుగు గంటల పాటు నానబెట్టు కోవాలి. ఆ తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో అల్లం, పచ్చి మిర్చి, బియ్యం పిండి, పుదీనా, ఉప్పు వేసి.. మరీ మెత్తగా కాకుండా.. కాస్త బరకగా రుబ్బుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని.. ఉల్లి పాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి.. వేడి చేసుకోవాలి.
ఆయిల్ వేడెక్కాక.. కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వడల్లా వత్తుకుని.. మరిగే ఆయిల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియంలో పెట్టి.. రెండు వైపులా ఎర్రగా వేయించి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే దాల్ మసాలా వడలు సిద్ధం. వీటిని టమాటా కిచప్ లేదా పెరుగు పచ్చడి, పుదీనా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఏమీ లేకున్నా ఉత్తిగా అయినా తినొచ్చు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.