Ragi Ambali : ఇప్పుడంటే అన్నం తింటున్నాం కానీ.. మా చిన్నప్పుడు రాగులు, జొన్నలు, కొర్రలు తినేవాళ్ళం అని మన పెద్దవారు చెబుతున్నపుడు విన్నాం.. అవి ఆరోగ్యానికి ఎంతో మంచివని పోషక పదార్ధాలున్నాయని అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు ఇప్పుడు చెబుతుంటే.. మళ్ళీ చిరు ధాన్యాలవైపు దృష్టి సారించాం. రాయలసీమ రాగి సంగటి ఎంతో ఫేమస్ .. అయితే రాగులతో చేసిన అంబలి తాగడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి రాగి అంబలి దివ్య ఔషధం వంటింది. ఈ రోజు రాగి అంబలిని ఎలా తయారు చేయాలో.. దీనిని తాగడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగులు
జీడిపప్పు, పల్లీలు, కిస్మిస్, తేనె (అషనల్)
రుచికి సరిపడా ఉప్పు
కారం కొంచెం
రాగులను కొంత పరిమాణంలో తీసుకుని వాటిని కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అనంతరం వాటిని శుభ్రమైన వస్త్రంలో కట్టి మళ్లీ కొన్ని గంటల పాటు ఉంచితే అవి మొలకెత్తుతాయి. కొన్ని సార్లు రాగులు మొలకెత్తడం ఆలస్యం కూడా అవచ్చు. అయినా కొంత సేపు నిరీక్షించి మొలకెత్తిన రాగులను సేకరించాలి. వాటిని బాగా ఎండబెట్టి దంచి పొడి చేయాలి. ఆ పొడిని కొంత నీటిలో వేసి బాగా ఉడికించాలి. దీంతో జావ తయారవుతుంది. ఇందులో ఇష్టమైనవారు జీడిపప్పు, పల్లీలు, కిస్మిస్, తేనె వంటివి కలుపుకోవచ్చు. లేదంటే ఉప్పు, కారం వేసుకుని ఒక పొంగు వచ్చేవరకూ ఉడికించితే రాగి అంబలి రెడీ అవుతుంది. దీనిని రోజూ తాగితే మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
* రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. శరీరానికి కావల్సిన పోషకాలు రాగి అంబలి ద్వారా అందుతాయి. శారీరక శ్రమ చేసేవారికి రాగి అంబలి మంచి బలాన్ని ఇస్తుంది.
*రాగి అంబలి పిల్లలకు మంచిది. మెదడు చురుగ్గా పనిచేసి.. చదువులో మంచి ప్రతిభను కనబరుస్తారు.
*శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది. చలువ చేస్తుంది.
*రాగి అంబలి ఒక్క గ్లాస్ తాగినా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది
*ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది. స్థూలకాయం ఉన్న వారు రాగి అంబలి తాగితే వేగంగా బరువు తగ్గవచ్చు.
*బీపీ, షుగర్ నియంత్రణలోకి వస్తాయి. రక్తస్రావం జరుగుతున్న వారికి రాగి అంబలి తాగిస్తే స్రావం ఆగిపోతుంది.
*రాగి అంబలిని నిత్యం తాగుతుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది.
ప్రతి రోజూ ఉదయం చేసే సాధారణ అల్పాహారానికి బదులుగా రాగి అంబలి తాగితే దాంతో మనం రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. శారీరక దృఢత్వం చేకూరుతుంది.