
సాధారణ లడ్డూల తయారీ కష్టంగా భావించేవారికి, చక్కెర వినియోగం తగ్గించాలనుకునేవారికి సాబుదానా లడ్డు సరైన ప్రత్యామ్నాయం. జవరిసి లేక సాబుదాన పిండితో తయారుచేసే ఈ లడ్డు రుచితోపాటు ఆరోగ్యకరమైనది. మరి ఇంకెందుకు ఆలస్యం కేవలం 15 నిమిషాల్లో మీ పండగను మరింత స్పెషల్ గా మార్చేయండి. ఈ లడ్డూ రెసిపీని ఇక్కడ చూడండి..
సాబుదాన – ½ కప్పు
యాలకులు – 1
జీడిపప్పు – 10
కొబ్బరి తురుము – ½ కప్పు
నెయ్యి – 250 మిల్లీలీటర్లు
చక్కెర – ¼ కప్పు
ముందుగా లడ్డూల కోసం మందపాటి సాబుదాన ఎంచుకోవాలి. దానిని శుభ్రం చేసి, ఒక పాన్‌లో వేయించుకోవాలి. ఈ సాబుదాన రంగు బంగారు గోధుమ రంగులోకి మారే వరకు వేయించడం ముఖ్యం. ఇది పూర్తిగా వేగడానికి దాదాపు 15 నిమిషాలు పడుతుంది.
వేయించిన సాబుదానను పూర్తిగా చల్లార్చాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడి చేసుకోవాలి. ఇదే జార్‌లో యాలకులు, చక్కెర వేసి మరొక్కసారి మెత్తగా రుబ్బుకోవాలి.
ఒక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేయాలి. తురిమిన కొబ్బరిని వేసి, దానిలోని తేమ పోయే వరకు వేయించుకోవాలి. వేరే పాన్‌లో మరికొంత నెయ్యి వేసి, జీడిపప్పును బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
సాబుదాన పొడిని, వేయించిన కొబ్బరి తురుమును ఒక గిన్నెలో కలపాలి. అందులో వేయించిన జీడిపప్పు ముక్కలు కూడా వేయాలి.
ఈ పొడి మిశ్రమమంతా బాగా కలిసిన తర్వాత, కొద్దికొద్దిగా నెయ్యి వేయాలి. నెయ్యి తగినంత కలిసిన తర్వాత, చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుంటే రుచికరమైన సాబుదాన లడ్డు సిద్ధం.
ఈ లడ్డు గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ ఉంచుకుంటే, ఒక వారం వరకు పాడవకుండా ఉంటుంది.