Mango Phirni Recipe: సమ్మర్ స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మ్యాంగో ఫిర్నీ’.. టేస్ట్ చేస్తే అస్సలు వదలరు!

ఎండకాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్ లో రంగురంగుల మామిడి పండ్లు సందడి చేస్తుంటాయి. మామిడికాయ ముక్కలు, మ్యాంగో షేక్స్, లస్సీలు ఎలాగూ ఎప్పుడూ తాగేవే. కానీ ఈ సారి వేసవి చల్లదనాన్ని, మామిడి పండ్ల తియ్యదనాన్ని కలిపి ఒక అద్భుతమైన రాయల్ స్వీట్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది? మొఘలాయ్ కాలం నాటి సాంప్రదాయ ఫిర్నీకి, మనకు ఇష్టమైన మామిడి పండ్ల ఫ్లేవర్ ను జోడించి చేసేదే ఈ 'మ్యాంగో ఫిర్నీ'. ఎంతో క్రీమీగా, టేస్టీగా ఉండే ఈ డెజర్ట్ ను తింటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే!

Mango Phirni Recipe: సమ్మర్ స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే మ్యాంగో ఫిర్నీ.. టేస్ట్ చేస్తే అస్సలు వదలరు!
Mango Phirni Recipe

Updated on: May 21, 2026 | 4:44 PM

వేసవి కాలంలో చల్లచల్లగా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అందరికీ గుర్తొచ్చేది ఐస్ క్రీములు లేదా పాయసం. అయితే ఈ సారి రొటీన్ కి భిన్నంగా ఉత్తర భారతదేశంలో ఎంతో ఫేమస్ అయిన ‘మ్యాంగో ఫిర్నీ’ని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. సాధారణ పాయసం (ఖీర్) కంటే ఇది మరింత చిక్కగా, క్రీమీగా నోట్లో వెన్నలా కరిగిపోతుంది. ఢిల్లీ, లక్నో, పంజాబ్ వంటి ప్రాంతాల్లో ఈ ఫిర్నీని మట్టి పాత్రల్లో (కుల్హడ్) చల్లబరిచి సర్వ్ చేస్తారు. మరి ఈ టేస్టీ మ్యాంగో ఫిర్నీ తయారీకి కావలసిన పదార్థాలు, అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు:

బియ్యం – 1 కప్పు

మామిడి పండ్ల గుజ్జు (Mango Pulp) – 2 కప్పులు

ఫుల్ క్రీమ్ పాలు – 4 కప్పులు

కుంకుమపువ్వు – 1 చిటికెడు

యాలకుల పొడి – 3/4 టీస్పూన్

తరిగిన బాదం, పిస్తా, కిస్ మిస్ – పావు కప్పు

చక్కెర – రుచికి సరిపడా

తయారీ విధానం:

ముందుగా బియ్యాన్ని బాగా కడిగి 2 నుంచి 3 గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల బియ్యం త్వరగా ఉడకడమే కాకుండా ఫిర్నీ టెక్స్చర్ ఎంతో క్రీమీగా వస్తుంది.

నానిన బియ్యంలోని నీటిని పూర్తిగా తీసేసి, మిక్సీ జార్ లో వేసి కొద్దిగా బరకగా (రవ్వలా) గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లా చేయకూడదు.

ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో పాలు పోసి మధ్యస్థ సెగపై మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం రవ్వను వేసి ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూనే ఉండాలి.

బియ్యం రవ్వ ఉడికే కొద్దీ పాలు చిక్కబడతాయి. ఆ సమయంలో చక్కెర, యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి. మిశ్రమం బాగా చిక్కబడ్డాక, తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ (బాదం, పిస్తా, కిస్ మిస్) సగం వేసి కలపాలి. మరో 2-3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఉడికించిన ఫిర్నీ మిశ్రమం కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు మామిడి గుజ్జు కలిపితే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది లేదా రుచి మారవచ్చు. అందువల్ల కాస్త చల్లారాక మామిడి పండ్ల గుజ్జు వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు సిద్ధమైన మ్యాంగో ఫిర్నీని సర్వింగ్ బౌల్స్ లో లేదా మట్టి పాత్రల్లోకి తీసుకుని 1 నుంచి 2 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. బాగా చల్లబడిన తర్వాత పైనుంచి మిగిలిన డ్రై ఫ్రూట్స్, మామిడి పండ్ల ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చల్లచల్లని క్రీమీ మ్యాంగో ఫిర్నీ రెడీ!

Follow Us