
నేటి బిజీ జీవితంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ఈ క్రమంలో అన్నం మానేసి చపాతీలు తినేవారి సంఖ్య భారీగా పెరిగింది. చపాతీ ఆరోగ్యకరమే అయినప్పటికీ సరైన అవగాహన లేకుండా ఎన్ని పడితే అన్ని తినడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోధుమ పిండితో తయారు చేసే చపాతీలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, తక్కువ మొత్తంలో ప్రోటీన్, ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూస్తుంది.
చపాతీ పరిమాణం అనేది వ్యక్తి చేసే శారీరక శ్రమ, వయస్సు, బరువుపై ఆధారపడి ఉంటుంది: సాధారణ శారీరక శ్రమ చేసేవారు రోజుకు 4 నుండి 6 చపాతీలు తీసుకోవచ్చు. మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉంటే రోజుకు 2 నుండి 4 చపాతీలకు పరిమితం అవ్వడం మంచిది. వీటికి బదులుగా సలాడ్లు, పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు రోజుకు 6 నుండి 8 చపాతీలు తిన్నా పర్వాలేదు.
చాలామంది రాత్రిపూట కడుపు నిండా చపాతీలు తింటారు. కానీ రాత్రి సమయంలో జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. అందుకే నిపుణులు రాత్రిపూట 1 నుండి 2 చపాతీలు మాత్రమే తినాలని సూచిస్తున్నారు. అంతకంటే ఎక్కువ తింటే అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో పాటు బరువు పెరిగే అవకాశం ఉంది.
ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం చపాతీ తినడమే కాదు, అది ఎంత తింటున్నాం అనే దానిపై దృష్టి పెట్టాలి. సరైన మోతాదులో ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..