ప్రతి నెలా మీ చేతికి రూ.9250.. ఒక్కసారి పెట్టుబడితో అద్భుత ఆదాయం.. ఈ పోస్టాఫీస్ పథకం గురించి తెలుసా..?
Post Office: మీ దగ్గర ఉన్న డబ్బును బ్యాంకులో దాచుకుంటున్నారా.. అంతకంటే రెట్టింపు ప్రయోజనం ఇచ్చే అద్భుతమైన మార్గం ఒకటి ఉంది.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ప్రతి నెలా మీ అకౌంట్‌లో రూ. 9,250 జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వ భరోసాతో, రూపాయి కూడా నష్టం లేకుండా నెలవారీ ఆదాయం పొందే ఈ పోస్ట్ ఆఫీస్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నేటి కాలంలో పెట్టుబడి పెట్టేటప్పుడు భద్రతతో పాటు స్థిరమైన ఆదాయం లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారు, గృహిణులు తమ వద్ద ఉన్న డబ్బును సురక్షితంగా ఉంచి, దాని ద్వారా నెలవారీ ఖర్చులకు డబ్బు రావాలని ఆశిస్తారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పథకమే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్.
నెలకు రూ. 9,250 ఎలా వస్తుంది?
ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 7.4శాతం వడ్డీని అందిస్తోంది. భార్యాభర్తలు లేదా ముగ్గురు పెద్దలు కలిసి జాయింట్ అకౌంట్ తెరవవచ్చు. ఈ ఖాతాలో గరిష్టంగా రూ.15 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. రూ.15 లక్షల పెట్టుబడిపై ఏడాదికి రూ.1,11,000 వడ్డీ వస్తుంది. దీనిని 12 నెలలకు విభజిస్తే, ప్రతి నెలా మీ చేతికి రూ. 9,250 ఆదాయం లభిస్తుంది. ఒకే వ్యక్తి ఖాతా తెరిస్తే గరిష్టంగా రూ.9 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. దీని ద్వారా నెలకు రూ. 5,550 ఆదాయం వడ్డీ రూపంలో అందుతుంది.
పథకం యొక్క ముఖ్య ఫీచర్లు
సురక్షితమైన పెట్టుబడి: ఇది కేంద్ర ప్రభుత్వ హామీతో నడిచే పథకం కాబట్టి మీ అసలు సొమ్ముకు ఎటువంటి రిస్క్ ఉండదు.
కాల పరిమితి: ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్లు. మెచ్యూరిటీ తర్వాత మీరు కోరుకుంటే దీన్ని పునరుద్ధరించుకోవచ్చు.
ఎవరు చేరవచ్చు?: 18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా ఈ ఖాతా తెరవవచ్చు. పిల్లల పేరు మీద కూడా తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టవచ్చు.
బదిలీ సౌకర్యం: మీరు మీ ఖాతాను దేశంలోని ఏ పోస్టాఫీసుకైనా సులభంగా బదిలీ చేసుకోవచ్చు.
ముందస్తు విత్‌డ్రాపై నిబంధనలు
ఒకవేళ మీకు అత్యవసరమై మెచ్యూరిటీ కంటే ముందే డబ్బు తీసుకోవాలనుకుంటే కొన్ని షరతులు వర్తిస్తాయి.
- ఖాతా తెరిచిన ఏడాది లోపు డబ్బు విత్‌డ్రా చేయడానికి వీలుండదు.
- 1 నుండి 3 ఏళ్లలోపు విత్‌డ్రా చేస్తే అసలు మొత్తంలో 2శాతం జరిమానాగా కోత విధిస్తారు.
- 3 నుండి 5 ఏళ్లలోపు విత్‌డ్రా చేస్తే 1శాతంబ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా పెన్షనర్లు, గృహిణులు తమ పొదుపు మొత్తాన్ని స్థిరమైన నెలవారీ ఆదాయంగా మార్చుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం. మీ దగ్గర ఉన్న నగదును బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఉంచి తక్కువ వడ్డీ పొందడం కంటేఇలాంటి ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం తెలివైన నిర్ణయం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




