హోటల్ స్టైల్ మెత్తటి దూదిలాంటి ఇడ్లీలను ఇంట్లోనే తయారు చేయండిలా..!
ఇడ్లీలు ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు కొంచెం గట్టిగా వస్తాయి. కానీ హోటల్స్‌లో తిన్నప్పుడు నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతాయి. అలాంటి మెత్తటి, స్పంజీ ఇడ్లీలు ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ఇవాళ మనం హోటల్ స్టైల్ ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ఇంట్లో ఇడ్లీలు కాస్త గట్టిగా రావటానికి ప్రధానంగా పిండిని తగిన విధంగా సిద్ధం చేయకపోవడమే కారణం. హోటళ్లలో మాత్రం ప్రత్యేకమైన కొలతలు పాటిస్తూ.. కొన్ని అదనపు చిట్కాలను పాటిస్తారు. అదే విధంగా చేస్తే మీ ఇంట్లో కూడా అచ్చమైన హోటల్ రుచిని పొందవచ్చు. ఇడ్లీలు తెల్లగా మెరిసిపోవాలంటే సగ్గుబియ్యం కలపడం చాలా ఉపయోగకరం. ఇక స్పంజీగా రావాలంటే సోయాబీన్స్ వేస్తే చాలు. అయితే వీటిని సరైన కొలతలతో తీసుకోవాలి. ఎక్కువైనా.. తక్కువైనా సరైన టెక్స్చర్ రాదు.
కావాల్సిన పదార్థాలు
- మినపప్పు – 1 కప్పు
- సగ్గుబియ్యం – ¼ కప్పు
- ఇడ్లీ రవ్వ – 2½ కప్పులు
- ఉప్పు – 1 టీ స్పూన్
- సోయాబీన్స్ – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
ముందుగా మినపప్పు, సగ్గుబియ్యం కలిపి కనీసం 4 గంటలు నీటిలో నానబెట్టాలి. సగ్గుబియ్యం కలపడం వల్ల ఇడ్లీలు మరింత తెల్లగా మారతాయి. ఇంకొక గిన్నెలో ఇడ్లీ రవ్వ వేసి అందులో ఉప్పు కలిపి నీటిలో నానబెట్టాలి. ఉప్పు వేసినప్పుడే రవ్వలోని మలినాలు బయటకు వచ్చి తేలికగా తొలగించుకోవచ్చు. కొంతమంది ఇడ్లీలు పూరీలా పొంగాలంటే ఏమి చేయాలో తెలుసుకోవాలని ఆలోచిస్తుంటారు. సోయాబీన్స్ కలపడం వల్ల అవి మెత్తగా, స్పంజీగా వస్తాయి. అందుకోసం 1 టేబుల్ స్పూన్ సోయాని నానబెట్టాలి.
నానబెట్టిన మినపప్పు, సగ్గుబియ్యం మిక్సీలో వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి. నీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. నీరు ఎక్కువైనా.. లేదా తక్కువైనా సరైన టెక్స్చర్ రాదు. గ్రైండ్ చేసిన పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇక ఇడ్లీ రవ్వను నానబెట్టిన నీటిని పూర్తిగా వంపేసి చేత్తో బాగా పిసికి మినపపిండిలో కలపాలి. అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేయాలి.
ఇప్పుడు పిండిని పులియనివ్వాలి (Fermentation). ఫ్రిజ్‌లో పెట్టకుండా బయటే కనీసం 8 గంటలు ఉంచాలి. రాత్రంతా ఉంచితే పొంగే బుడగలు ఏర్పడతాయి. ఇది మెత్తని ఇడ్లీ రహస్యం. ఉదయాన్నే ఇడ్లీ ప్లేట్లలో పిండిని వేసి స్టీమర్‌లో ఉడికించాలి. కేవలం 10-12 నిమిషాల్లోనే హోటల్ స్టైల్ మెత్తటి, తెల్లటి ఇడ్లీలు రెడీ. ఇలా చేసి చూడండి. హోటల్‌లో తిన్నంత రుచికరమైన, మెత్తటి ఇడ్లీలను మీ ఇంట్లోనే తినొచ్చు.