ప్రెగ్నెన్సీలో తప్పకుండా తినాల్సిన లడ్డూలు.. రుచికరమైన, సులభమైన ఈ రెసిపీ మీకోసం..!

గర్భం ప్రతి మహిళ జీవితంలో మధురమైన దశ. ఈ సమయంలో తల్లి శరీరానికి ఎన్నో పోషకాలు అవసరం. బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన శక్తిని అందించడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటివారి కోసమే స్పెషల్ లడ్డూ రెసిపీ తీసుకొచ్చాను. ఈ లడ్డూలు రుచితో పాటు శక్తిని కూడా ఇస్తాయి. తల్లికి కావాల్సిన శక్తిని, శిశువు ఎదుగుదల కోసం అవసరమైన పోషకాలను అందిస్తాయి.

ప్రెగ్నెన్సీలో తప్పకుండా తినాల్సిన లడ్డూలు.. రుచికరమైన, సులభమైన ఈ రెసిపీ మీకోసం..!
Healthy Pregnancy Ladoo

Updated on: Jun 27, 2025 | 5:12 PM

లడ్డూలను ఎందుకు తీసుకోవాలంటే.. గర్భధారణ సమయంలో శరీరానికి పోషకాల అవసరం పూర్తిగా మారుతుంది. ఈ సమయంలో తల్లి తీసుకునే ప్రతి ఆహారం బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే శక్తినిచ్చే, జీర్ణక్రియకు సహాయపడే, ఆరోగ్యాన్ని బలపరిచే లడ్డూలను అలవాటుగా తినడం మంచిది. ఇవి తక్కువ సమయంలో శక్తిని అందించే చిన్న స్నాక్ లా పని చేస్తాయి. ఈ లడ్డూలకు కావాల్సిన పదార్థాలు, వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

ఖర్జూరాలు.. ఇవి సహజంగా తీపిగా ఉంటాయి. కాబట్టి లడ్డూలో చక్కెర అవసరం లేకుండానే రుచికరంగా తయారవుతుంది. ఇవి ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో శక్తినిస్తాయి.

బాదం, జీడిపప్పు, నువ్వులు, అవిసె గింజలు (Flaxseeds).. వీటిలో ఉండే మంచి కొవ్వులు, విటమిన్లు, ప్రొటీన్లు శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయి.

డ్రై ఫ్రూట్స్.. ఎండు ద్రాక్ష (Raisins), ఆప్రికాట్లు (Apricots), అంజీర్ (Figs).. వంటి డ్రై ఫ్రూట్స్ లలో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తహీనత రాకుండా కాపాడతాయి.

తయారీ విధానం

గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఈ లడ్డూలు చాలా మంచివి. వీటిని తయారు చేయడం కూడా సులభమే. ముందుగా ఖర్జూరాలు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ లను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి లడ్డూకు తీపిదనాన్ని ఇస్తాయి. ఆ తర్వాత బాదం, జీడిపప్పు, అవిసె గింజలు, నువ్వులు వంటి నట్స్ సీడ్స్‌ ను కొద్దిగా దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి.

ఇప్పుడు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, వేయించిన నట్స్ పొడి అన్నీ ఒకేసారి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ నట్స్ పరిమాణాన్ని పెంచుకోవచ్చు. ఈ లడ్డూలను గాలిపోని డబ్బాలో భద్రపరుచుకుంటే.. ఆకలి అనిపించినప్పుడు ఒకటి తింటే వెంటనే శక్తి వస్తుంది.

మీరు లడ్డూలు తయారు చేసేటప్పుడు.. మీకు నచ్చిన పదార్థాలను కలుపుకోవచ్చు. ఉదాహరణకు మీకు బాదం కన్నా జీడిపప్పు ఎక్కువ ఇష్టమైతే దాన్ని ఎక్కువ వేసుకోవచ్చు. అయితే గర్భధారణ సమయంలో.. ఏ పదార్థాలు మీకు సరిపోతాయో తెలుసుకోవడానికి డైటీషియన్ లేదా డాక్టర్‌ ను అడగడం మంచిది. లడ్డూలు ఆరోగ్యానికి మంచివి కానీ మితంగా తీసుకోవడమే ఉత్తమం. రోజుకు ఒకటి లేదా రెండు సరిపోతాయి.

ఆరోగ్యకరమైన ఈ లడ్డూలు గర్భిణులకు మంచివే. అయితే మీ ఆహారంలో ఏమైనా మార్పులు చేసే ముందు డాక్టర్‌ సలహా తప్పకుండా తీసుకోండి.