
మన భారతీయ భోజనంలో పచ్చిమిరపకాయ లేనిదే రుచి రాదు. కూరల్లో వేసినా, పక్కన నంజుకున్నా ఆ కిక్కే వేరు. అయితే చాలా మంది మహిళలు దీనిని కేవలం కారం కోసమే తింటారని అనుకుంటారు. కానీ ఈ చిన్న మిరపకాయలో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. బరువు తగ్గడం నుండి రోగనిరోధక శక్తి పెంచడం వరకు పచ్చిమిరపకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. పచ్చిమిరపకాయలో క్యాప్సైసిన్ అనే క్రియాశీల పదార్ధం ఉంటుంది. ఇది శరీరంలో వేడిని పెంచి, జీవక్రియను ఉత్తేజపరుస్తుంది.
మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? అయితే మీ భోజనంలో పచ్చిమిరపకాయ ఉండాల్సిందే. ఇందులోని క్యాప్సైసిన్ థర్మోజెనిసిస్‌ను పెంచి, శరీరంలోని అదనపు కేలరీలను దహించడానికి సహాయపడుతుంది. ఇది సహజంగానే మీ మెటబాలిజం రేటును పెంచుతుంది.
ఉసిరికాయ తరహాలోనే పచ్చిమిరపకాయలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది. అంతేకాదు విటమిన్ సి వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ముఖంలో సహజమైన కాంతి పెరుగుతుంది.
జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ పరిశోధన ప్రకారం.. పచ్చిమిరపకాయలు రక్తంలోని చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. భోజనం చేసిన తర్వాత ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి, చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఇవి అడ్డుకుంటాయి.
పచ్చిమిరపకాయలు తినడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు, జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మనం తిన్న ఆహారం త్వరగా, సాఫీగా అరగడానికి తోడ్పడుతుంది.
ఆరోగ్యంగా ఉన్న మహిళలు రోజుకు ఒకటి లేదా రెండు చిన్న పచ్చిమిరపకాయలు తినడం సురక్షితం. అయితే, అతిగా తింటే కడుపులో మంట లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే అల్సర్లు ఉన్నవారు, మొలల సమస్యతో బాధపడేవారు లేదా తీవ్రమైన అసిడిటీ ఉన్నవారు పచ్చిమిరపకాయలను తగ్గించడం లేదా పూర్తిగా మానుకోవడం మంచిది. ప్రకృతి అందించిన ఈ స్పైసీ ఔషధాన్ని పరిమితంగా తీసుకుంటే.. అది మీ ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారుతుంది. కాబట్టి బాస్, రేపటి నుండి మీ భోజనంలో ఆ పచ్చిమిర్చి ఘాటును మిస్ అవ్వకండి..