ఇది పండే కాదు అద్భుత ఔషధం కూడా.. కర్బూజ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?
వేసవిలో శరీరానికి చలువనిచ్చే ఉత్తమ పండ్లలో కర్బూజ (మస్క్ మెలన్) ఒకటి. దాదాపు 90 శాతం నీటితో కూడిన ఈ పండు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా విటమిన్ A, విటమిన్ C, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాల్షియం వంటి కీలక పోషకాలను అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం, బరువు నియంత్రణకు తోడ్పడడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడడం, రోగనిరోధక శక్తిని పెంచడంలో కర్బూజ ఉపయోగకరంగా ఉంటుంది.

కర్బూజ పండును ప్రకృతి మానవునికి ప్రసాదించిన గొప్ప వరం అని చెప్పవచ్చు. దీని జన్మస్థానం భారతదేశమేనని కొంతమంది చరిత్రకారులు పేర్కొన్నారు. భారతదేశం నుండి కర్బూజ చైనా, ఇతర ప్రపంచ దేశాలకు విస్తరించింది. క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు దేశంలో దీని సాగు ఉండేదని, ఆనాటి గ్రీకు వైద్యుడు గాలెన్ దీని ఔషధ గుణాలను వివరించినట్లు చరిత్ర ఆధారాలున్నాయని.. రోమన్లు కూడా ఈ పండును సాగు చేసేవారని.. పలువురు ఆహార నిపుణులు పేర్కొంటుంటారు. వాస్తవానికి కర్బూజ పండు ఉపయోగాలు, ఔషధ గుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇందులో దాదాపు 90 శాతం వరకు నీరు ఉంటుంది. ఇది శరీరానికి అద్భుతమైన చలువను అందించడమే కాకుండా, కేలరీలు లేని సహజమైన తీపిదనాన్ని ఇస్తుంది. ఈ పండులో లేత నారింజ రంగులో ఉండే గుజ్జు రుచిగా ఉంటుంది. పైన మందంగా, గరుకుగా ఉండే తోలుతో పోలిస్తే లోపల గుజ్జు మెత్తగా ఉంటుంది. భారతదేశంలో అధికంగా పండినా, తుర్కమెనిస్తాన్‌లో లభించే కర్బూజాలు అద్భుత సువాసన, మధురమైన రుచితో ప్రసిద్ధి చెందాయి. అక్కడ వీటిని స్వర్గ ఫలాలు అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆగస్టు రెండవ ఆదివారం మెలన్ డేగా జరుపుకుంటారు. పక్వానికి వచ్చినప్పుడు వచ్చే కమ్మని వాసన మస్క్ డీర్ జింక వాసనను పోలి ఉండటం వల్ల దీనికి మస్క్ మెలన్ అనే పేరు వచ్చింది. దీని వృక్షశాస్త్రీయ నామం కుకుమిస్ మెలో, ఇది కుకుర్బిటేసి కుటుంబానికి చెందినది.
కర్బూజ పోషక విలువలు – ఆరోగ్య ప్రయోజనాలు:
కర్బూజ పండులో డైటరీ ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఎ, ఫోలిక్ ఆమ్లం, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
శరీరానికి చలువ: అధిక వేడితో బాధపడేవారికి కర్బూజ పండు అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. దీనిని తినడం లేదా రసం తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గి ఆరోగ్యం చేకూరుతుంది.
జీర్ణక్రియ – మూత్రపిండాల ఆరోగ్యం: ఆయుర్వేదంలో దీని రసాన్ని ఆకలి మందగించడం, మలబద్ధకం, మూత్రనాళ సమస్యలు, ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు. 90 శాతం నీటి శాతం మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీలో రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది.
బరువు నియంత్రణ: తక్కువ కేలరీలు, అధిక పీచుపదార్థం ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా శ్రేష్టమైన పండు.
గుండె – ఎముకల ఆరోగ్యం: ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కాల్షియం వృద్ధాప్యంలో ఎముకలకు బలాన్నిచ్చి, వాటిని పటిష్టం చేస్తుంది.
చర్మ – కంటి ఆరోగ్యం: విటమిన్ సి, విటమిన్ ఎ చర్మ సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులకు దీని రసాన్ని పూయడం ప్రయోజనకరం. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
గర్భిణీ స్త్రీలకు మేలు: ఫోలిక్ ఆమ్లం గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం. ఇది బిడ్డ ఎదుగుదలకు, సుఖ ప్రసవానికి తోడ్పడుతుంది. ప్రసవం తర్వాత చనుబాలు వృద్ధి చెందడానికి కూడా సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి – శక్తి: విటమిన్ సి తెల్ల రక్త కణాలను ప్రేరేపించి బ్యాక్టీరియా, వైరస్లను నాశనం చేస్తుంది. అలసటగా ఉన్నప్పుడు ఒక గ్లాసు రసం తక్షణ శక్తిని, నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. పొగ తాగడం ఆపిన తర్వాత ఊపిరితిత్తులు నికోటిన్ నుండి కోలుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది.
ఇతర ప్రయోజనాలు: కడుపులో పుండ్లను తగ్గిస్తుంది, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచి, వీర్య కణాల సంఖ్యను వృద్ధి చేసి సంతాన భాగ్యాన్ని కలిగిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది. క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడంలో సహాయపడుతుంది. దంతాలు గట్టిపడటానికి కాల్షియం, జుట్టు, గోర్ల ఆరోగ్యానికి బి విటమిన్లు దోహదపడతాయి. స్త్రీలలో నెలసరి సమస్యలను తగ్గిస్తుంది.
కర్బూజ రసం తాగేటప్పుడు ఐస్, పంచదార కలపకుండా తాగితేనే అందులోని పోషకాలను పూర్తిగా పొందవచ్చని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలున్నా.. సందేహాలున్నా.. నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
