వీటిని చీప్‌గా చూడకండి.. ఆ సమస్యకు మందుల అవసరమే ఉండదు.. దెబ్బకు మటుమాయం
శీతాకాలంలో మలబద్ధకం సమస్య సర్వసాధారణం. నీటి కొరత, ఆహారపు అలవాట్ల వల్ల ఇది తీవ్రమవుతుంది. అయితే.. సహజమైన పద్ధతుల ద్వారా మలబద్ధకాన్ని నివారించవచ్చు.. ఫైబర్, పోషకాలతో నిండి ఉన్న కొన్ని ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మందులకు బదులుగా, సహజమైన మార్గాల ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పొందవచ్చు.
ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి.. అలాంటి వాటిలో మలబద్దకం ఒకటి.. దీర్ఘకాలిక మలబద్ధకం అనేది ఒక సాధారణ సమస్య.. ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. వాస్తవానికి, చలికాలంలో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీంతోపాటు.. మనం తీసుకునే ఆహారం వల్ల మలబద్దకం వస్తుంది.. చలికాలంలో మలబద్ధకం సమస్యను అధిగమించడానికి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.. దీనివల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు..
ముఖ్యంగా ఆహారాలలో సహజ ఫైబర్, పోషకాలు ఉండేలా చూసుకోవాలి.. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మందుల అవసరం ఉండదు. మలబద్ధకం సమస్య నుంచి సులువుగా ఉపశమనం పొందవచ్చు.. అంతేకాకుండా సహజంగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు..
ఖర్జూరం: ఖర్జూరంలో సహజ చక్కెరలు, పీచుపదార్థాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖర్జూరంలో ఫైబర్ అధికంగా ఉంటుంది.. ఇది ప్రేగులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.. చలికాలంలో ఖర్జూరాన్ని పాలతో మరిగించి తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. 2-3 ఖర్జూరాలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తింటే సమస్య పరిష్కారం అవుతుంది.
పప్పు ధాన్యాలు: తృణధాన్యాలు, మొలకలలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చలికాలంలో శెనగలు, కిడ్నీ బీన్స్, మసూర్ పప్పు తదితర పప్పులను ఆహారంలో తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల ప్రేగు కదలికలు పెరిగి మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
చిలగడదుంప/ గనుసుగడ్డ: స్వీట్ పొటాటోస్ ఫైబర్, పొటాషియానికి అద్భుతమైన మూలం. ఇందులో పెక్టిన్, డైటరీ ఫైబర్ ఉంటాయి. ఇది ప్రేగు కదలికను పెంచుతుంది.. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. చలికాలంలో చిలగడదుంప తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. సహజంగా మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
సోంపు: సోంపు కడుపుని చల్లబరుస్తుంది.. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనానికి, కడుపులో గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. సోంపు టీ తాగడం లేదా సోంపు నమలి తినడం ద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..