
మన దేశంలో భోజనం ముగిశాక గుప్పెడు సోంపు నోట్లో వేసుకోవడం శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. హోటళ్లకు వెళ్లినా, శుభకార్యాలకు వెళ్లినా భోజనం తర్వాత సోంపును తప్పనిసరిగా వడ్డిస్తారు. అయితే ఇది కేవలం నోటి దుర్వాసన పోగొట్టడానికే అనుకుంటే పొరపాటే.. సోంపుకు కొంచెం జీలకర్ర తోడైతే అది శరీరానికి ఒక శక్తివంతమైన సహజ ఔషధంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే కడుపులో జీర్ణ ప్రక్రియ మొదలవుతుంది. ఆ సమయంలో సోంపు, జీలకర్ర కలిపి నమలడం వల్ల కడుపులోని ఎంజైమ్‌లు చురుగ్గా మారుతాయి. జీలకర్ర జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఆహారం త్వరగా శక్తిగా మారేలా చూస్తుంది. ఇది కడుపులోని కండరాలను రిలాక్స్ చేసి, ఆహారం సులభంగా ముందుకు సాగేలా చేస్తుంది. దీనివల్ల భోజనం తర్వాత కడుపు భారంగా అనిపించదు.
నేటి కాలంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య గ్యాస్, అసిడిటీ. రాత్రిపూట భోజనం తర్వాత గ్యాస్‌తో ఇబ్బంది పడేవారికి ఈ రెండింటి కలయిక అద్భుతంగా పనిచేస్తుంది. సోంపు కడుపులో గ్యాస్ ఏర్పడకుండా నిరోధిస్తే, జీలకర్ర పేరుకుపోయిన గ్యాస్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. గుండెల్లో మంట లేదా ఛాతీలో అసిడిటీగా అనిపించే వారికి సోంపు చల్లదనాన్ని ఇచ్చి ఉపశమనం కలిగిస్తుంది.
సోంపు, జీలకర్ర కేవలం జీర్ణక్రియకే పరిమితం కాదు వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి:
బరువు తగ్గడం: జీలకర్ర శరీరంలోని మెటబాలిజంను పెంచుతుంది, ఇది క్యాలరీలను త్వరగా కరిగించడానికి తోడ్పడుతుంది.
నోటి ఆరోగ్యం: సోంపు నోటిలోని బ్యాక్టీరియాను చంపి, సహజమైన మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది.
షుగర్ లెవల్స్: డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలోని చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో జీలకర్ర కొంతవరకు సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
డిటాక్స్: ఇవి కాలేయం, మూత్రపిండాలను లోపలి నుండి శుభ్రపరచడానికి సహకరిస్తాయి.
భోజనం ముగిసిన తర్వాత ఒక చిన్న చెంచా సోంపు, అర చెంచా వేయించిన జీలకర్ర కలిపి బాగా నమిలి తినాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల దీర్ఘకాలిక కడుపు సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..