
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంపెనీల మధ్య పోటీ తీవ్రమైంది. దీంతో సహజంగానే ఆ ఒత్తిడి ఉద్యోగులపై పడుతుంది. ఎక్కువ పని గంటలు, టార్గెట్ పూర్తి చేయడం, మరోవైపు ఉద్యోగ భద్రత ఇలా ఎన్నో అంశాలు ఉద్యోగులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. మరీ ముఖ్యంగా ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో గెడ్‌లైన్స్ తీవ్ర మానసిక ఒత్తిడికి కారణమవుతుంటాయి. అయితే కార్యాలయాల్లో ఎదురయ్యే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆఫీసు పనిని ఎప్పుడూ ఆఫీసుకు మాత్రమే పరిమితమయ్యేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆఫీసు పనివేళల తర్వాత ఆఫీస్ పనికి సంబంధించిన ఇమెయిల్‌లను తనిఖీ చేయడం లేదా ఫోన్ కాల్‌లు తీసుకోవడం మానేయండి. మీ ఖాళీ సమయాన్ని పూర్తిగా మీకోసమే స్పెండ్ చేయండి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆఫీసు గురించి ఆలోచించడం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
ఇక దీర్ఘకాలంగా పనిచేయకుండా అప్పుడప్పుడు వర్క్ నుంచి చిన్న చిన్న విరామాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గంటలతరబడి కంప్యూటర్ ముందు కూర్చోకుండా అప్పుడప్పుడు కుర్చీలో నుంచి లేచి తిరగడం అలవాటు చేసుకోవాలి. కనీసం ప్రతీ 2 గంటలకు ఒకసారి 10 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆఫీస్ లైఫ్ బోర్ కొట్టకుండా ఉండాలంటే కచ్చితంగా సహోద్యోగులతో మంచి సంబంధాలను ఏర్పరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వారితో కలిసి భోజనం చేయడం, అప్పుడప్పుడు బయటకు వెళ్లడం లాంటివి చేయాలని చెబుతున్నారు.
ఇక పని భారం ఎక్కువవుతున్నా కొందరు ఎవరికీ చెప్పకుండా భరిస్తుంటారు. అయితే అది మీ పని నాణ్యతపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ పని మీరు భరించలేనంత భారంగా ఉంటే వెంటనే మీ బాస్‌కు ఆ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించండి. ఇలా తెలియజేస్తే వారు సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉంటాయి. ఇక మీ ఆహారపు అలవాట్లు, దినచర్యపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఈ అలవాట్లు మీ శారీరక ఆరోగ్యాన్ని చక్కగా ఉంచడమే కాకుండా మానసిక అలసటను దూరం చేస్తాయి.
ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో కూడా కొన్నిసార్లు విశ్రాంతి తీసుకోండి. గంటల తరబడి కూర్చొని అలాగే పనిచేస్తే మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రీత్ ఎక్సర్‌సైజ్, మెడిటేషన్ వంటివి అలవాటు చేసుకోవాలి. ఇవేవీ చేసినా ప్రతిఫలం లేకపోతే.. మానసిక వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..