Heart Health: మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మన ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. వీటి కారణంగా ప్రధానంగా గుండెపై చెడు ప్రభావం పడుతుంది. ఈ కారణంగానే ప్రస్తుతం మానవాళీని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో గుండె సంబంధిత సమస్యలే ప్రథమ స్థానంలో ఉన్నాయి. అయితే ఎలాంటి గుండె సమస్యలను అయినా దూరంగా పెట్టేందుకు కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుందని కార్డియాలజిస్టులు, ఫిట్‌నెస్, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తాము సూచించిన చిట్కాలను పాటిస్తే గుండెను ఆరోగ్యవంతంగా కాపాడుకోవచ్చని వారు వివరిస్తున్నారు. మరి గుండె ఆరోగ్యం కోసం వారు ఇస్తున్న సూచనలేమిటో ఇప్పుడు చూద్దాం..
రోజుకు కనీసం 2 లీటర్ల నీరు: చిట్టి గుండె ఆరోగ్యం, మెరుగైన పనితీరు కోసం నీరు చాలా అవసరం. శరీరం హైడ్రేటెడ్‌గా లేకపోతే రక్తం చిక్కగా మారి గడ్డకట్టే ప్రమాదం ఉంది. ఫలితంగా మీ గుండెకు బ్లడ్ పంపింగ్ జరగక, ప్రాణాంతక పరిస్థితికి దారితీయవచ్చు. అందువల్ల ప్రతి రోజూ కనీసం 8 గ్లాసులు లేదా 2 లీటర్ల నీళ్లను తప్పనిసరిగా తీసుకోవాలి.
హెల్త్ చెకప్: వయసుతో పాటు శరీరానికి ఆరోగ్య సమస్యలు కలగడం సహజం. కానీ వాటిని ముందుగానే గుర్తించి చికిత్స పొందితే సురక్షితంగా జీవించవచ్చు. ఈ కారణంగానే 30 ఏళ్ళ వయసు దాటినవారు ప్రతి ఏడాది తప్పనిసరిగా 2 సార్లు హెల్త్ చెకప్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తన్నారు. ఇలా చేయడం వల్ల గుండె లేదా శరీరానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా ముందుగానే నివారణ మార్గాలను పాటించవచ్చని వారు వివరిస్తున్నారు.
రోజూ వ్యాయామం: ఆరోగ్యవంతమైన శరీరానికి వ్యాయామం కూడా అవసరం. ఇందుకోసం మీరు రోజూ కనీసం 20 నిముషాల పాటు వ్యాయామం లేదా వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల గుండె జబ్బులతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటివాటిని కూడా నివారించవచ్చు.
కొవ్వును కరిగించుకోండి: శరీరంలో కొవ్వు ఉండడం కూడా గుండెపై ప్రభావం చూపుతుంది. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె సమస్యలకు, ఊబకాయానికి దారి తీస్తుంది. అందువల్ల శరీరంలో కొవ్వును కరిగించడం కోసం వాకింగ్ చేయాలి, ఇంకా ఆయిల్ ఫుడ్‌ని తక్కువగా తీసుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..