ఇంటికి కిచెన్ గుండెకాయ అని మన పెద్దలు అంటారు. కిచెన్ ఎంత క్లీన్ గా ఉంచుకుంటే, ఇంటికి అందం అంతే పెరుగుతుందంటారు. వాస్తు ప్రకారం కిచెన్ ని క్రమపద్ధతిలో ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని మనలో చాలామంది నమ్మకం. కిచెన్ లో ఉండే వస్తువులు కూడా వాస్తు నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఇలా చేయకపోతే వాస్తు దోషాలు ఏర్పడి కుటుంబ జీవన శైలిపై ప్రతికూల ప్రభావం చూపుతాయంటారు పెద్దలు.
కిచెన్ లో పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ప్రతి ఇంట్లో కిచెన్ అన్నపూర్ణ దేవి నివాసంగా, అగ్ని దేవుని స్థలంగా భావించబడుతుంది. కాబట్టి అక్కడ ప్రతికూల శక్తులు ఉండకూడదు. కొన్ని వస్తువులు పొరపాటున కిచెన్ లో ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీకి దారి తీస్తుంది. ఇది కుటుంబ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. అందుకే కిచెన్ ని ఎప్పుడూ కూడా క్లీన్ గా ఉంచాలి.
కొంతమంది కిచెన్ ని అందంగా కనపడేలా అద్దాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ ఇవి వాస్తు నిబంధనలకు విరుద్ధంగా ఉంటాయి. గాజు వస్తువులు నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయట. అలాగే అగ్ని దేవుడి ప్రతిబింబం అద్దంలో కనిపించడం కూడా మంచిది కాదంటున్నారు. ఇది కుటుంబ శాంతి, ఆనందాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి కిచెన్ కి అద్దాలు, గాజు వస్తువులను దూరంగా ఉండేలా చూసుకోండి.
కిచెన్ ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. కిచెన్ మురికిగా ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎంట్రీకి ఆహ్వానం పలికినట్లే. రాత్రి పూట ఎంగిలి పాత్రలను కిచెన్ లో అలాగే వదిలేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం దూరమవుతుందని వాస్తు జ్యోతిష్యులు చెబుతున్నారు. అవసరమైతే ఆ పాత్రలను బయట ఉంచాలి కానీ వంటగదిలో ఉంచకూడదు.
కొంతమంది మెడిసిన్స్ లను కిచెన్ లో ఉంచుతారు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. కిచెన్ లో మెడిసిన్స్ ఉంచకూడదనే వాస్తు నిబంధనను తప్పక పాటించాలి. అలాగే, విరిగిపోయిన పాత్రలు లేదా వస్తువులు కూడా కిచెన్ లో ఉంచరాదు. ఈ అలవాటు అదృష్టానికి హాని చేస్తుందని, పనుల్లో ఆటంకాలు కలిగిస్తుందని పెద్దలు కూడా చెబుతున్నారు. అందుకే, విరిగిన వస్తువులను వెంటనే తొలగించడం మంచిది.
కిచెన్ లో కడాయి లేదా పాన్‌ను బోర్లా ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదట. ఇవి ఎవరికీ కనిపించకుండా సక్రమంగా ఉంచాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని వాడడం ద్వారా కిచెన్ లో పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవచ్చు. ఈ నియమాలను పాటించడం ద్వారా కుటుంబ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయని వాస్తు జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.