
ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొందరు డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు జిమ్‌లో వ్యాయామం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుత జీవనశైలి కారణంగా చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య పెరిగిపోతుంది. జీవనశైలిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ గుండెపోటును నివారించడానికి కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి నిపుణులు అవసరమైన కొన్ని సహజ చిట్కాలను చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మీరు ఎంత బిజీగా ఉన్నా, ప్రతిరోజూ కొంత శారీరక శ్రమ చేయాలి. అంటే మీరు వ్యాయామం కోసం కనీసం అరగంట కేటాయించాలి. భారీ వ్యాయామాలు అవసరం లేదు. ఆరోగ్యానికి మేలు చేసే యోగా భంగిమలు చేయవచ్చు. అందుకు వాకింగ్ చేయవచ్చు. జాగింగ్ కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. సాధారణ వ్యాయామాలు కూడా గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయని కార్డియాలజిస్టులు అంటున్నారు. సైక్లింగ్, డ్యాన్స్, తోటపని వంటి కార్యకలాపాలు గుండెను సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి. అలా చేయడం ద్వారా గుండెపోటు ప్రమాదం కనీసం 30% తగ్గే అవకాశం ఉంది.
గుండె సరిగ్గా పనిచేయాలంటే మనం తీసుకునే ఆహారం సరిగ్గా ఉండాలి. ఎందుకంటే అనేక సమస్యలు ఆహారం నుండే తలెత్తుతాయి. ఈ సమస్యలకు పరిష్కారం కూడా మన ఆహారంలోనే ఉంటుంది. అందువల్ల రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం చాలా అవసరం. అంతేకాదు లీన్ ప్రోటీన్ అధికంగా ఉండే మాంసాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన నూనెలను కూడా తీసుకోవాలి. వంట కోసం ఆలివ్ నూనెను ఉపయోగించడం మంచిది. చిక్కుళ్ళు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ ఆహారాలన్నింటినీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. విత్తనాలు తినడం గుండెను బలపరుస్తుంది. కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి సహాయపడతాయి.
ఒత్తిడి పెరిగే కొద్దీ గుండె అధికంగా శ్రమపడుతుంది. దాని పనితీరు మారుతుంది. ఇది తెలియకుండానే గుండెపోటుకు దారితీస్తుంది. ఒత్తిడి పెరిగే కొద్దీ రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. కొన్నిసార్లు ఒత్తిడి అతిగా తినడం, మద్యం సేవించడం, ధూమపానం వంటి అలవాట్లకు దారితీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజూ కనీసం 5 నిమిషాలు లోతైన శ్వాస వ్యాయామాలు చేయాలి. ప్రాణాయామం, ధ్యానం, యోగా మంచిది. ప్రియమైనవారితో సమయం గడపడం, సంగీతం వినడం, సినిమాలు చూడటం కూడా మంచి అలవాట్లే. మొత్తంమీద మీరు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇది గుండెను సురక్షితంగా ఉంచుతుంది.
బాగా నిద్రపోయే వ్యక్తికి ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ నిద్రలేమితో బాధపడేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇది శరీరంపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఇది గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా అధిక రక్తపోటు, హృదయ స్పందన రేటులో మార్పులు, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తేలా చేస్తుంది. అందువల్ల, ప్రతిరోజూ 7 నుంచి 9 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. గుండెను సురక్షితంగా ఉంచడానికి నిద్ర అవసరమని గుర్తుంచుకోండి.
గుండె ఆరోగ్యం కోసం అనుసరించాల్సిన మరో ముందు జాగ్రత్త ఏమిటంటే బిపి, కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను క్రమంతప్పకుండా తనిఖీ చేసుకోవడం. అంటే మీరు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒంట్లో ఏయే అంశాలు ఏ సమయంలో ఎంత ఉన్నాయో మీకు స్పష్టమైన ఐడియా ఉండాలి. ఎప్పటికప్పుడు మీ బరువును తనిఖీ చేసుకోవడం కూడా మంచిది. అధిక కొలెస్ట్రాల్, అధిక బిపి లక్షణాలు అకస్మాత్తుగా కనిపించవచ్చు. అందువల్ల వీటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అది చేయి దాటిపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.