వేసవిలో చికెన్, గుడ్లు తింటే వేడి చేస్తుందా? న్యూట్రిషనిస్టులు చెప్పే విషయాలు తింటే షాకవుతారు
వేసవి కాలం వచ్చిందంటే చాలు ఆహారపు అలవాట్లపై రకరకాల సందేహాలు మొదలవుతాయి. ముఖ్యంగా కోడిగుడ్లు, చికెన్, చేపలు వంటివి తింటే శరీరంలో వేడి పెరుగుతుందని, మొటిమలు వస్తాయని, జీర్ణక్రియ మందగిస్తుందని చాలామంది వీటిని తినడం పూర్తిగా మానేస్తుంటారు. వేసవిలో మాంసాహారం తినడం మంచిదేనా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

ఎండలు మండిపోతున్న సమయంలో మాంసాహారం తీసుకోవడం నిజంగా ఆరోగ్యానికి హానికరమా లేక ఇవన్నీ కేవలం అపోహలేనా అనే విషయంపై పోషకాహార నిపుణులు ఆసక్తికరమైన నిజాలను వెల్లడించారు. వేసవిలో ఈ ఆహార పదార్థాలను ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం.
అపోహ మాత్రమే..
వేసవిలో కోడిగుడ్లు, చికెన్, చేపలు తినడం అన్ హెల్తీ అనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ నమామి అగర్వాల్ స్పష్టం చేశారు. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందించి శక్తిని ఇస్తాయని ఆమె వివరించారు. గుడ్లు తింటే శరీరంలో వేడి పెరుగుతుందనే మాట నిజమే అయినప్పటికీ, పరిమితంగా తీసుకుంటే అది సంపూర్ణ ఆహారంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గుడ్డులోని సొనను అస్సలు వదలకూడదు, ఎందుకంటే గుడ్డులో ఉండే క్యాల్షియం, ఐరన్ లో 90 శాతం కేవలం సొనలోనే ఉంటుంది.
చికెన్, చేపలు, గుడ్లలో లీన్ ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో, ఎముకలు మరియు పళ్ళను దృఢంగా ఉంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. మరో నిపుణురాలు మెహర్ రాజ్‌పుత్ ప్రకారం, వేసవిలో రోజుకు రెండు గుడ్లు తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతకంటే ఎక్కువ తీసుకుంటేనే శరీర ఉష్ణోగ్రత పెరిగి కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
జాగ్రత్త తప్పనిసరి..
వేసవిలో ఈ ప్రోటీన్ రిచ్ ఆహారాన్ని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. భారీగా వేయించిన వంటకాలు, మసాలా సాస్‌లకు దూరంగా ఉండటం మంచిది. వాటికి బదులుగా గ్రిల్లింగ్, స్టీమింగ్ లేదా తక్కువ నూనెతో ఉడికించడం వంటి పద్ధతులను ఎంచుకోవాలి.
దీనివల్ల జీర్ణక్రియ సులభమవుతుంది. అలాగే పెరుగు, కీరదోస, పుదీనా వంటి చలువ చేసే పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలి. తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వల్ల వేసవిలో కూడా ఈ పోషకాహారాన్ని సురక్షితంగా ఆస్వాదించవచ్చు. ఏవైనా మార్పులు చేసే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
