AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20ల్లోనే బట్టతల.. జుట్టుతో వేల కోట్ల బిజినెస్.. హెయిర్ లాస్ వెనుక అసలు నిజాలివే..

20, 30 ఏళ్లకే బట్టతల రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటు జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి, పోషకాహార లోపం వంటి అంశాలు ప్రభావం చూపొచ్చు. జుట్టు ఊడుతోందని నూనెలు, షాంపూలు మార్చడం కంటే కారణాన్ని గుర్తించి వైద్య నిపుణులను సంప్రదించడం ముఖ్యం. ఇదే సమయంలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, విగ్గులు, హెయిర్ కేర్ ఉత్పత్తులతో బట్టతల చుట్టూ భారీ మార్కెట్ ఏర్పడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘హెయిర్ వ్యాక్సిన్’ గురించి కూడా వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

20ల్లోనే బట్టతల.. జుట్టుతో వేల కోట్ల బిజినెస్.. హెయిర్ లాస్ వెనుక అసలు నిజాలివే..
Early Baldness
Gunneswara Rao
| Edited By: |

Updated on: Sep 30, 2026 | 8:19 AM

Share

అటు అర ఎకరం పోయింది. ఇటు మరో అర ఎకరం పోయింది. మధ్యలో ఉన్నదాని సంగతి ఎందుకులే భయ్యా.. దాచుకోలేరు.. చెప్పుకోలేరు. వెనకాల ఎన్ని ఎకరాలు ఉన్నా.. అందాన్ని ఇవ్వవు. ఆత్మవిశ్వాసాన్ని పెంచవు. ఈమధ్య నలుగురిలోకీ వెళ్లాలంటేనే ఆదోరకంగా ఉంది బాస్ అంటూ తెగ ఫీలైపోతుంటారు. ఇదంతా చిన్న వయసులోనే బట్టతల వచ్చిన వారి గురించే. ఈమధ్య ఓ రీసెర్చ్ చేశారు. దాదాపు ఐదున్నర లక్షమంది పురుషులపై ఆ అధ్యయనం జరిగింది. ఇందులో వెలుగులోకి వచ్చిన విషయాలను చూస్తే.. బాధనిపిస్తుంది. అదే సమయంలో ఇది చాలా పెద్ద అలెర్ట్ ని ఇచ్చింది. వయసుతో పాటు వచ్చే బట్టతల సంగతి సరే. కానీ మరీ 20ల్లో, 30ల్లోనే జుట్టు ఊడిపోతుంటే.. ఆ బాధ ఎవరికీ చెప్పుకోవాలి? అలాగని లైట్‌గా తీసుకోలేరు. సరేలే అని సరిపెట్టుకోవడానికి ఇది ఒకరిద్దరి ఆవేదన కాదు. కొన్ని కోట్ల మంది పడుతున్న నరకయాతన. ఇంతకీ ఇంత మందికి బట్టతల ఎందుకు వస్తోంది? అది ఆరోగ్య సమస్యా లేక జీవనశైలిలో లోపమా? డాక్టర్లు ఏం చెబుతున్నారు? అసలు.. బట్టతల చుట్టూ మన దేశంలో జరిగే వ్యాపారం ఎంతో తెలిస్తే షాకవుతారు? ఈ సమస్యకు కారణమేంటో, డాక్టర్లు చెప్పే పరిష్కార మార్గాలేమిటో, సొసైటీలో రావాల్సిన మార్పేమిటో అన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం..

జుట్టు గురించి మహిళలే ఎక్కువగా ఆలోచిస్తారని చాలా మంది అనుకుంటారు. హెయిర్ చాలా ఊడిపోతోందని ఆయిల్స్, షాంపూలను మారుస్తుంటారు. నిజానికి ఇది మహిళల సమస్య మాత్రమే కాదు.. మగవారి సమస్య కూడా. అందుకే నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడేవారు విగ్ లు పెట్టుకుంటారు. అది ఇష్టం లేనివాళ్లు. కాస్త గడ్డం పెంచి కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు. తక్కువ వయసులోనే బాల్డ్ హెడ్ తో ఉన్నవారిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకునేవారు కొందరైతే.. పాపం అని నిట్టూర్చేవారు మరికొందరు. ఈమధ్య జరిగిన సర్వేలో చూస్తే.. యంగ్ ఏజ్ లోనే బట్టతల వచ్చేస్తోంది. జుట్టు సమస్యలకు చాలా కారణాలున్నాయి. వీటిలో ముఖ్యమైంది లైఫ్‌స్టైలే. ఇదే వారి పాలిట పెద్ద శత్రువు అవుతోంది. హెయిర్ ఫాల్ అవుతుంటే.. గుండె వేగంగా కొట్టేసుకుంటుంది. బాబోయ్.. వెంట్రుకలు ఊడిపోయి బట్టతల వచ్చేస్తుందేమో అని భయపడిపోతారు. వెంటవెంటనే హెయిర్ ఆయిల్స్, షాంపూలు మార్చేస్తారు. వంటింటి చిట్కాలు, బామ్మల సలహాలు, యూట్యూబ్ వీడియోల్లో చెప్పే సజెషన్స్ అన్నింటినీ మార్చి మార్చి ఫాలో అయిపోతారు. అసలు తమ సమస్యకు కారణమేంటో, మూలమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. తీరా హెయిర్ ఫాల్ ఎక్కువయ్యి.. బట్టతల కనిపిస్తుందీ అన్న దశలో డాక్టర్ దగ్గరకు వెళతారు.

నిజానికి బట్టతలకు ప్రధాన కారణం.. వారి లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం. లేచింది మొదలు పడుకునే వరకు పరుగు పెట్టడం. సరైన నిద్ర లేకపోవడం, మానసికంగా ఒత్తిడి, పెరిగిపోవడం, జీవక్రియ తగ్గిపోవడం.. ఇంకా చాలా కారణాలున్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్న అధ్యయనం తెలిపిందీ ఇదే. జుట్టు ఒత్తుగా, దృఢంగా ఉండాలన్నా.. దానికి అంతర్గత ఆరోగ్యం ముఖ్యం. సరైన మోతాదులో పోషకాలు అందకపోయినా, ఒత్తిడి పెరిగినా.. ఆ ఎఫెక్ట్ ఫస్ట్ పడేది.. జుట్టుపైనే. దీనికి కారణం లేకపోలేదు. మెంటర్ ప్రెజర్ పెరిగినప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువవుతుంది. దీనివల్ల హెయిర్ గ్రోత్ దెబ్బతింటుంది. ఇక సర్వే ప్రకారం చూస్తే.. నార్త్ ఇండియన్స్ కన్నా.. సౌతిండియన్స్ లో హెయిర్ హెల్త్ ప్రాబ్లమ్ పెద్దదనే చెప్పాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు అనారోగ్య సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు. కాకపోతే ఇక్కడ టెన్షన్ పెడుతున్న పాయింట్ ఏమిటంటే.. హెయిర్ ఊడిపోతున్న పురుషుడి సగటు వయసు 29 సంవత్సరాలు. తనకు బట్టతల వస్తోంది అని గ్రహించి.. డాక్టర్ ని కన్సల్ట్ చేసే సమయానికి.. దాదాపు 55 శాతం మందిలో ఆ ప్రాబ్లమ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లిపోతోంది.

ఫిజికల్ గా ఫిట్ గా ఉంటే సరిపోదు. మెంటల్ గా కూడా హెల్దీగా ఉండాలి. ఈమధ్య యూత్ లో నిద్ర బాగా తగ్గిపోతోంది. సెల్ ఫోన్లు పట్టుకుని అర్థరాత్రి దాటిన తరువాత కూడా వాటితోనే గడుపుతున్నారు. ఇక అలాంటప్పుడు కణాలు ఎక్కడ డెవలప్ అవుతాయి. జాతీయస్థాయిలో నిద్రలేమితో ఉన్నవారు 29.5 శాతం ఉంటే.. తెలంగాణలో అంతకన్నా ఎక్కువే ఉన్నారు. తమిళనాడు, కర్ణాటకలో కూడా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది. సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోతే మెటబాలిజం కరెక్ట్ గా ఉండదు. దీనివల్లే జుట్టుకు పోషకాలు అందక.. వేగంగా ఊడిపోతోంది. బట్టతలకు దారితీస్తోంది. హెయిర్ ఊడుతోంది అనగానే.. ఆయిల్స్, షాంపూలు మార్చేసినంత మాత్రానే ప్రయోజనం ఉండదు. వారికున్న అనారోగ్య సమస్యలను ముందుగా క్లియర్ చేసుకోవాలి. దానివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అది శారీరకంగా ఫిట్ గా ఉండేలా చేస్తుంది. అదే సమయంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీనిని ఫేస్ చేసేవారు జాతీయస్థాయిలో సగటున 54.6 శాతం మంది ఉంటే.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో విడివిడిగా చూస్తే.. అంతకన్నా ఎక్కువగానే ఉన్నారు. అంటే మానసికంగా ప్రెజర్ ఎంత పెరుగుతోందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. కచ్చితంగా ఇది అలారం బెల్ మోగిస్తున్నట్టే. ప్రభుత్వాలు కూడా దీనిపై ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చేసింది.

ఫిజికల్ గా ఫిట్ గా ఉండడానికి రోజూ 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. కూరగాయలు, ఆకుకూరలు పండ్లు, మిల్లెట్స్ ను తీసుకోవాలి. నాన్ వెజ్ తినేవారైతే.. ఫిష్, చికెన్, గుడ్లను తీసుకోవచ్చు. ఇవన్నీ సమపాళ్లలో తీసుకుంటే దాని వల్ల జుట్టు ఊడే సమస్యకు మంచి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. బట్టతలపై జుట్టు మొలిపిస్తాం అని చెప్పి బిజినెస్ చేసేవారు తక్కువేం కాదు. ఇలాంటివారితో జాగ్రత్త. అయినా హెయిర్ సమస్యలకు వైద్యనిపుణులను సంప్రదించడమే మంచిది అని మర్చిపోవద్దు.

మన దేశంలో ఏటా… బట్టతల చుట్టూ జరిగే జరిగే బిజినెస్ ఎంతో తెలుసా.. దాదాపు 10 వేల కోట్ల రూపాయిలు. అంటే బాల్డ్ హెడ్ కు చికిత్స చేయడం, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఈ బిజినెస్ లో భాగమే. అందుకే ఇది అన్ని వేల కోట్ల రూపాయిల మార్కెట్ గా మారింది. వీటిలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ బిజినెస్సే నాలుగు వేల కోట్ల పైమాటే. దీనికి కారణం లేకపోలేదు. విదేశాలతో పోలిస్తే.. మన దగ్గర దీనికి అయ్యే ఖర్చు దాదాపు సగం తగ్గిపోతుంది. అందుకే మన దేశానికి మెడికల్ టూరిజం పేరుతో వస్తున్నారు. దీనివల్లే మన దేశంలో ఏటా మూడున్నర లక్షలకు పైగా హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు జరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు.. ఇలాంటి ప్రధాన నగరాలు దీనికి కేంద్రాలుగా ఉన్నాయి. ఇక హెయిర్ విగ్గుల మార్కెట్ కూడా తక్కువేమీ కాదు. ఇది కూడా దాదాపు వేయి కోట్ల రూపాయిల మార్కెట్ ఉంటుంది. ఇందులో ఏటా దాదాపు 10 నుంచి 15 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఈ మార్కెట్ పెరగడానికి కారణం.. సర్జరీ లేకుండా.. జుట్టు కనిపించేలా చేసుకునే వెసులుబాటు ఉండడమే.

ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని విని నిజంగా ఆశ్చర్యపోతారు. మన దేశం 2025-26లో 651 మిలియన్ డాలర్ల విలువైన ప్రాసెస్ చేసిన మానవ జుట్టును విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేసింది. ఇక ప్రాసెస్ చేయని.. అంటే మరో 286 మిలియన్ డాలర్ల విలువైన శుభ్రం చేసిన మానవ జుట్టును ఎగుమతి చేసింది. దీనికి విగ్గులు, హెయిర్ నెట్ లు ఇలాంటి వాటిని కూడా కలిపితే.. మొత్తం ఎక్స్ పోర్ట్స్ విలువ సుమారు 950 మిలియన్ డాలర్లు ఉంటుంది. అంటే దాదాపు 9 వేల కోట్ల రూపాయిల పైమాటే. మన దేశం.. అప్పడాలు, టూత్‌బ్రష్‌లు, తేనె వంటి ఉత్పత్తుల నుంచి సంపాదించిన దానికన్నా ఈ జుట్టు నుంచి సంపాదించిందే ఎక్కువ. అమెరికా, యూరప్, ఆఫ్రికాలోని సెలూన్స్ లో హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ గా అమ్ముతుంటారు. జుట్టును ఎగుమతి చేసే వ్యాపారంలో ప్రపంచంలోనే 88 శాతం వాటా మన దేశానిదే. దీనిని బట్టి మన దేశంలో మనిషి జుట్టు చుట్టూ తిరిగే బిజినెస్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక బట్టతలకు బైబై చెప్పేందుకు వ్యాక్సిన్ వచ్చేస్తోంది అని చాలా మంది అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జుట్టు కుదుళ్ల చుట్టూ రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా.. బట్టతల సమస్యను నివారించడానికి వీలుగా కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీని గురించి అందరికీ ఈజీగా అర్థం కావడం కోసం.. హెయిర్ వ్యాక్సిన్ అని పిలుస్తున్నారు. దీని గురించి యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీ లో పబ్లిష్ అయ్యింది. ఇందులో ఏం చెప్పుకొచ్చారంటే.. ఇమ్యూన్ మాడ్యులేషన్, రీజెనరేటివ్ మెడిసిన్.. ఈ రెండింటినీ కలిపి జుట్టు రాలే సమస్యలకు ఎలా వాడొచ్చనే దానిపై ప్రయోగాలు చేస్తున్నారు. అంతే కానీ.. ప్రస్తుతానికి హెయిర్ వ్యాక్సిన్ లు ఏవీ అందుబాటులో లేవు. ఆ పేరు చెప్పి ఎవరైనా మభ్యపెడితే అస్సలు నమ్మవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జుట్టు మనిషికి అందాన్నిచ్చేదే. ఇది ఎవరూ కాదనలేరు. కానీ జుట్టు లేనంత మాత్రాన వాళ్ల వ్యక్తిత్వం మారిపోదు కదా. సొసైటీ నుంచి వచ్చే విమర్శలను, హేళనను తట్టుకోలేక.. కేవలం జుట్టు కోసం వేలు, లక్షల రూపాయిలు ఖర్చు చేసే వారు ఎందరో ఉన్నారు. అలాగని వారికి పెద్ద ఉపశమనం ఉంటుందని చెప్పలేం. ఇక ఖర్చు చేయలేని వారు.. మౌనంగా ఆ ఆవేదనను భరిస్తున్నారు. ఇక్కడ కావలసింది అందంకన్నా ఆత్మవిశ్వాసం. అప్పుడే జుట్టు ఉన్నా, ఊడినా.. బట్టతల వచ్చినా.. తగ్గేదేలే అని తొడగొట్టి మరీ చెబుతారు.

Follow Us