Health: అదే పనిగా ప్లాస్టిక్ బాటిల్‌లో మిగిలిన నీళ్లు తాగుతున్నారా.? రోగాలన్నీ రూపాయల్లో కొనితెచ్చుకున్నట్టే..

దూరప్రయాణాలు చేస్తున్నారా.. బస్ లోనో కారు లోనో ప్రయాణిస్తున్నారా. మార్గ‌మధ్యలో దాహం వేస్తే రోడ్డు పక్కన ఉన్న దుకాణాల నుండో బస్ స్టాప్ నుండో వాటర్ బాటిల్‌ను కొనుగోలు చేస్తున్నారా.. అదే నీటిని తాగేసి మిగిలిన వాటర్‌ను అలాగే ఉంచేసి.. నాలుగు ఐదు రోజుల తర్వాత తాగుతున్నారా.!

Health: అదే పనిగా ప్లాస్టిక్ బాటిల్‌లో మిగిలిన నీళ్లు తాగుతున్నారా.? రోగాలన్నీ రూపాయల్లో కొనితెచ్చుకున్నట్టే..
Water Bottle Cap

Edited By: Ravi Kiran

Updated on: Nov 21, 2025 | 7:51 PM

ప్రయాణాల్లో వాటర్ బాటిల్ కొన్నారా అయితే జాగ్రత్త. సీల్ తీసిన వెంటనే ఆ నీటిని పూర్తిగా తాగేయండి. లేదంటే మీ ప్రయాణం ముగిసిన‌ తర్వాత అయినా ఆ బాటిల్‌ను ఖాళీ చేసి పక్కన పడేయండి. బాటిల్‌లో నీరు ఉంది కదా అలాగే నిల్వ ఉంచి.. గుర్తొచ్చినప్పుడు అదే నీటిని తాగుడామనుకుంటే మాత్రం రోగాలను రూపాయల్లో కొనుకున్నట్టే. కారులో ప్రయాణిస్తున్న సమయంలో మాత్రం మరింత జాగ్రత్తగా ఉండక తప్పదు. రోడ్డు పక్కన కొనుగోలు చేసిన వాటర్ బాటిల్‌ను వెంటనే తాగేయడమే ఉత్తమం. లేదని సగం బాటిల్‌ను తాగేసి కారులో ఉంచారా అసలుకే ఎసరు తెచ్చుకున్నట్టే. ఆ బాటిల్ నీటిని వేడెక్కేదాకా కారులోనే ఉంచితే ఆ బాటిల్‌లో బ్యాక్టీరియా పెరిగి.. అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. కారులో ఉంచిన ప్లాస్టిక్ డబ్బాలో నీరు సురక్షితం కాదని పలు అధ్యయనాల్లో వెల్లడైందని నిపుణులు సూచిస్తున్నారు. ఒకసారి బాటిల్ మూత తీసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 24 గంటల కంటే ఎక్కువ సమయం నిల్వ ఉంచకూడదని.. అలా నిల్వ ఉంచిన నీటిని తాగక పోవడమే ఉత్తమం అంటున్నారు వైద్యులు. సీల్ ఓపెన్ చేసిన వాటర్ బాటిల్ నీరు తాగితే చేతులు, నోరు, గాలి నుంచి బ్యాక్టీరియా ఆ బాటిల్ లోనికి చేరుతుందని.. అలాంటి నీటిని 24 గంటల తర్వాత తిరిగి తాగితే వికారం, తలనొప్పి. అలసట, కడుపు నొప్పి, తిమ్మిరి, వాంతులు, విరేచనాలు, ఇతర జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.

ముఖ్యంగా కారులో దూర ప్రయాణాలు చేసే వ్యక్తులు.. వాటర్ బాటిల్‌లోని నీటిని సీల్ ఓపెన్ చేశాక పక్కన పడేస్తారు. మళ్లీ సడన్‌గా గుర్తు రాగానే అదే నీటిని తాగేస్తారా.. కనీసం ఆ నీళ్లు ఎప్పుడు కొనుగోలు చేశారో.. ఎన్ని రోజుల నుండి కారులోనే ఉన్నాయో కూడా ఆలోచించరు.. అలాంటి నీటిని తాగితే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా చాలా సందర్బాల్లో చాలా మంది కారులో ప్రయాణించినంత సేపు కారులో ఏసీని ఆన్‌లోనే ఉంచుకుంటారు. కారులో ఉంచిన వాటర్ బాటిల్ కూడా ఏసీ ఆన్‌లో ఉన్నంత సేపు చల్లగానే ఉంటుంది. ఎప్పుడైతే ఏసీ ఆపివేస్తామో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోతుంది. పొరపాటున ఎండలో పార్క్ చేసి ఉంచుతామో.. బయట వాతావరణంలోని ఉష్ణోగ్రత కంటే రెండు రెట్ల ఉష్ణోగ్రత కారులో చేరుతోంది. ఆ సమయంలో కారులోనే ఉంచి‌న నీరు వేడెక్కి 60 డిగ్రీల వరకు చేరుతుంది. తిరిగి కారు ఆన్ చేసి ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆ నీటిని తాగితే చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ రసాయన మార్పులకు లోనవుతుందని.. 60 డిగ్రీల నుంచి తిరిగి 20 – 30 డిగ్రీలకు ఒక్కసారిగా ఆ వాటర్ బాటిల్‌లోని నీరు మార్పు చెందడంతో ఆ బాటిల్‌లో రసాయన ప్రక్రియ కొనసాగి అందులోకి బీపీఏ చేరుతుందని హెచ్చరిస్తున్నారు.

బీపీఏ అంటే వాటర్ బాటిల్ అందంగా మెరిసేందుకు వినియోగించే బీస్పెనాల్ అనే రసాయనం. నీటిలో బీపీఏ కలిస్తే.. టైప్-2 డయాబెటిస్, గుండెజబ్బులు, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, మెదడు పెరుగుదలపై ప్రభావం, క్యాన్సర్, సంతానోత్పత్తి సమస్యలు, ఆస్తమా సమస్యలు అటాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అత్యవసరం అయితే తప్ప వాటర్ బాటిల్ నీళ్లు తాగవద్దని.. ముందే ప్రయాణాలను ఖరారు చేసుకుంటే వెంట రాగి , స్టీల్ బాటిల్లను తీసుకెళ్లాలని.. అందులో నిల్వ చేసిన నీటిని తాగాలని చెప్తున్నారు వైద్యులు. ప్లాస్టిక్ బాటిల్స్‌లోని నీరు ఆరోగ్యానికి ఎప్పుడు మంచిది కాదని అంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నీటిలో ఎక్కువగా మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయని.. వీటి కారణంగా బీపీ పెరిగే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో రుజువైందని హెచ్చరిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) సంస్థ బాటిల్డ్ వాటర్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్‌ను అత్యంత ప్రమాదకర ఆహారాల జాబితా(హై రిస్క్ ఫుడ్ లిస్ట్)లో చేర్చిందని గుర్తు చేస్తున్నారు. కనీసం ఇప్పటి నుండి అయినా ప్లాస్టిక్ బాటిల్లలో నీటి తాగడం తగ్గించండి.. తప్పనిసరి పరిస్థితుల్లో తాగాల్సి వస్తే పై జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.